మా బాబు వయసు ఏడాది. మూత్రం వెళ్లే దగ్గర రంధ్రం సరిగ్గా కనిపించడం లేదు. మిగతా అంతా బాగానే ఉంది. యూరిన్‌కు వెళ్లేటప్పుడు కూడా ఏ ఇబ్బందీ లేదు. ఇలా ఉందని డాక్టర్లను కలిశాం. ఒకరేమో..ఏమీ కాదనీ, పెరిగేకొద్దీ మామూలుగా అయిపోతుందని చెప్పారు. ఇంకొకరేమో.. సర్కంసిషన్ (సున్తీ) చేయిస్తే మంచిదని అన్నారు. ఇలా ఎందుకయ్యింది? మా బిడ్డకు నిజంగానే సున్తీ చేయించాలా? సలహా ఇవ్వండి.
మీరు చెప్పిన వివరాల ప్రకారం.. మీ బిడ్డకు ‘ఫిజియలాజికల్ ఫైమోసిస్’ అనే పరిస్థితి ఉన్నది. దీంట్లో మగపిల్లల్లో జననాంగం ముందు ఉండే చర్మం బయటికి లేకుండా.. అంతా మూసుకుపోయి ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో సాధారణ విషయమే! అయితే, మూత్రం పోసేటప్పుడు ధార (స్ట్రీమ్) మంచిగా ఉంటూ, బిడ్డకు ఇబ్బంది లేకుంటే.. ఎలాంటి ఆపరేషన్ చేయించాల్సిన అవసరం లేదు. కొందరిలో ఎదుగుదలలో భాగంగా సహజంగానే ఇలా ఉంటుంది. ఆ చర్మాన్ని లాగడం కానీ, సర్కంసిషన్ చేయించడం కానీ అవసరం లేదు. అయితే, ఇది ఫిజియలాజికల్ ఫైమోసిస్ సమస్యనేనా? కాదా? అనేది తెలుసుకోవాలి. అందుకోసం మీరు ఒకసారి పీడియాట్రిక్ సర్జన్‌ను కలవండి. ఇప్పటికే మీరు చూపించిన డాక్టర్.. బహుశా పీడియాట్రీషియన్ కావొచ్చు. అయినా.. పీడియాట్రిక్ సర్జన్‌కు కూడా చూపించండి.
వాళ్లయితేనే అవసరం మేరకు స్కాన్ చేయిస్తారు. ఒకవేళ సమస్య ఇదేనని నిర్ధారిస్తే.. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ మూత్రం పోసేటప్పుడు ధారను గమనించే ఉంటారు. ఆ ధార (స్ట్రీమ్) చక్కగా వస్తున్నట్టయితే ఆందోళన అవసరంలేదు. అయితే, కొంతమంది పిల్లల్లో మూత్రం వెళ్లే దారి చిన్నగా అయిపోవడం, చర్మం మొత్తం ఇబ్బందికరంగా ఉండటం లాంటి సమస్యలు కనిపిస్తాయి. అలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రం సర్కంసిషన్ అవసరం ఏర్పడుతుంది. అయితే, తప్పకుండా పీడియాట్రిక్ సర్జన్‌ను కలిసి, ఆయన సలహా మేరకే ఆపరేషన్ చేయించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సర్కంసిషన్ చేయించకూడదు. కాబట్టి మీరు డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్స పొందండి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్