నెలలు నిండక ముందే మా వదిన ప్రసవించింది. బేబీకి ఆరోగ్య సమస్యలు లేవు. పుట్టినప్పుడు పాప ఒక కిలో ఆరు వందల గ్రాముల బరువుంది. బేబీకి కంగారూ మదర్ అవసరమని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు. కంగారు మదర్ అంటే ఏమిటి? దానిని ఫాదర్ కూడా చేయవచ్చునా?
శిశువు పుట్టిన తర్వాత తల్లి శరీరానికి తాకుతూ దగ్గరగా ఉండేలా పడుకోబెడతారు. అలాగే ఛాతీపై ఎత్తుకుని ఉంచుకోమంటారు. ఇలా తల్లీబిడ్డ దగ్గరగా ఉండటం వల్ల శిశువు శరీర ఉష్ణోగ్రత చక్కగా ఉంటుంది. బిడ్డ బరువు పెరుగుతాడు. బిడ్డకు, తల్లికి అనుబంధం ఏర్పడుతుంది. రోగనిరోధకత సామర్థ్యం పెరుగుతుంది. నెలలు నిండకముందు పుట్టిన శిశువులకు, పుట్టినప్పుడు రెండున్నర కిలోల కంటే తక్కువ బరువు ఉన్న శిశువులకు కంగారూ మదర్ కేర్ అవసరమని సూచిస్తాం. ఎవరైతే ఎక్కువ సమయం కంగారూ మదర్ కేర్ తీసుకుంటారో? వాళ్లు హాస్పిటల్ నుంచి త్వరగా డిశ్చార్జ్ అవుతున్నారు.
ఇంటికి వెళ్లిన తర్వాత కూడా బిడ్డకు కంగారూ మదర్ కేర్ చేయొచ్చు. దీనివల్ల బిడ్డ ఎదుగుదల కూడా బాగుంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం నెలలు నిండక ముందే పుట్టిన శిశువులకు, పుట్టిన డబ్బు రెండు గంటల్లో కంగారూ మదర్ కేర్ తీసుకున్నవాళ్లకు బతికే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. బిడ్డ బరువు పెరగడానికి, ఎదగడానికి, ప్రాణ సంరక్షణకు ఎంతో ముఖ్యమైన కంగారూ మదర్ కేర్ని అవసరమైతే ఫాదర్ కూడా చేయొచ్చు. ఫాదర్ చేసినా అవే ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి వైద్యులు సూచిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా కంగారూ మదర్ కేర్ని ఆచరించండి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్