Activated Char Coal | పూర్వం ప్రజలు బొగ్గులతో దంతాలను తోముకునే వారన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బొగ్గును పాత్రలను శుభ్రం చేసేందుకు కూడా ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు బొగ్గు దాదాపుగా లభించట్లేదు. అందరూ వంట గ్యాస్‌ను వాడుతున్నారు. కనుక బొగ్గు రావడం లేదు. కానీ ప్రస్తుతం మార్కెట్లో మనకు యాక్టివేటెడ్ చార్ కోల్ అని లభిస్తుంది. దీన్ని కొందరు వినే ఉంటారు. దీన్ని ఎక్కువగా మెడిసిన్లను, సౌందర్య సాధన ఉత్పత్తులను తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు తమ టూత్ పేస్ట్లలోనూ చార్ కోల్‌ను అందిస్తున్నాయి. అయితే వాస్తవానికి చార్ కోల్ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మనకు మార్కెట్లో పొడి, ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. దీన్ని బాహ్యంగా ఉపయోగించవచ్చు. లేదా అంతర్గతంగా కూడా తీసుకోవచ్చు. యాక్టివేటెడ్ చార్ కోల్‌తో మనకు అనేక లాభాలు కలుగుతాయి. దీంతో పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు.
యాక్టివేటెడ్ చార్ కోల్ అంటే కర్రలను కాల్చడం వల్ల ఏర్పడే బొగ్గు. కానీ దీన్ని మనకు నేరుగా విక్రయించరు. చార్ కోల్‌ను తయారు చేసిన తరువాత శుభ్రం చేసి మనకు ప్యాక్‌లలో అందిస్తారు. యాక్టివేటెడ్ చార్ కోల్‌ను చార్ కోల్ అని సింపుల్‌గా కూడా పిలుస్తారు. కొందరు దీన్ని కొబ్బరి టెంకలు లేదా పొట్టును కాల్చి దాంతో వచ్చే బొగ్గు ద్వారా తయారు చేస్తారు. అయితే ఏ పదార్థం ఉపయోగించినా కూడా చార్ కోల్ ఒకటే విధంగా ఏర్పడుతుంది. ఇక చార్ కోల్‌తో దంతాలను తోముకోవడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియ నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. చార్ కోల్‌కు చెందిన ట్యాబ్లెట్లు మనకు ఆన్ లైన్లో, మెడికల్ షాపుల్లో లభిస్తాయి. వీటిని పోషకాహార నిపుణులు లేదా వైద్యుల సూచన మేరకు తీసుకోవచ్చు. సాధారణంగా వీటిని రోజుకు 500 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకుంటారు. ఈ ట్యాబ్లెట్లను వాడడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది.
ఫుడ్ పాయిజనింగ్ అయిన వారు యాక్టివేటెడ్ చార్ కోల్‌ను వాడితే ఎంతో ఫలితం ఉంటుంది. సాధారణంగా కొన్ని సార్లు మనకు మనం తాగే ద్రవాలు, తినే ఆహారం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అలాంటప్పుడు యాక్టివేటెడ్ చార్ కోల్ ను తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల పొట్టలో ఉండే అసౌకర్యం కూడా తొలగిపోతుంది. యాక్టివేటెడ్ చార్ కోల్‌ను తీసుకుంటుంటే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. బాడీ డిటాక్స్ అవుతుంది. మద్యం విపరీతంగా సేవించడం వల్ల వచ్చే హ్యాంగోవర్ సమస్యను చార్ కోల్ తగ్గిస్తుంది. హ్యాంగోవర్ ఉన్నవారు యాక్టివేటెడ్ చార్ కోల్‌ను తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
పురుగులు, కీటకాలు కుట్టిన చోట కొబ్బరినూనెలో యాక్టివేటెడ్ చార్ కోల్‌ను కలిపి రాయాలి. దీంతో మంట, దురద, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అన్ని రకాల చర్మ సమస్యలకు కూడా చార్ కోల్‌ను ఉపయోగించవచ్చు. దీన్ని పలు రకాల ఫేస్ ప్యాక్‌లలోనూ వాడవచ్చు. దీన్ని వాడడం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. చర్మం తేమగా, మృదువుగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. యాక్టివేటెడ్ చార్ కోల్‌ను వాడడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు సైతం తగ్గిపోతాయి. ఇలా యాక్టివేటెడ్ చార్ కోల్ మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.