Health tips : ఆలుగడ్డలను చాలామంది ఇష్టంగా తింటారు. ఆలుగడ్డ కూర ఎంతో రుచిగా ఉండటమే అందుకు కారణం. ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్న కారణంగా కొందరు ఆలుగడ్డలను ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటారు. ఇలాంటప్పుడు తేమ కారణంగా ఆలుగడ్డలపై మొలకలు వస్తాయి. ఇలా మొలకలు వచ్చిన ఆలుగడ్డలను తింటే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఆలుగడ్డలకు మొలకలు వస్తే వాటిలో సొలానిన్ (solanine) అనే విషపదార్థం ఉత్పత్తి అవుతుందట. ఈ సొలానిన్ ఆరోగ్యానికి హాని చేస్తుందట.
ఆలుగడ్డలను సరిగా నిల్వచేయకపోవడంవల్ల, ఎక్కువ రోజులపాటు నిలువ ఉంచడంవల్ల, తేమ, తక్కువ వెలుతురు లాంటి కారణాల వల్ల వాటిపై మొలకలు వస్తాయి. ముఖ్యంగా వేడి, తేమ కలిగిన ప్రదేశాల్లో ఆలుగడ్డలను నిల్వచేస్తే మొలకలు ఇంకా త్వరగా వస్తాయి.
సొలానిన్ అనేది ఒక విషపూరితమైన పదార్థం. ఇది ఆలుగడ్డలతోపాటు కొన్ని రకాల నైట్షేడ్ కూరగాయలలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. మొలకలు వచ్చినప్పుడు లేదా పచ్చగా మారినప్పుడు ఆలుగడ్డల్లో సొలానిన్ స్థాయిలు పెరుగుతాయి. సొలానిన్ ఎక్కువగా తీసుకుంటే.. కడుపు నొప్పి, వికారం, తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలకు కూడా ఈ సొలానిన్ కారణం అవుతుంది.
జీర్ణ సమస్యలు : సొలానిన్ తీసుకోవడంవల్ల అజీర్తి, కడుపు నొప్పి, వికారం లాంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యలు సొలానిన్ మోతాదు అధికంగా ఉంటే అధికంగా ఉంటాయి.
నరాల సమస్యలు : సొలానిన్ మన నరాలపై ప్రభావం చూపుతుంది. దాంతో నాడీ సంబంధ వైఫల్యాలు, నొప్పులు, మెడ తిమ్మిర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది తక్కువ పరిమాణంలో సొలానిన్ తీసుకున్నా నరాలపై ఎక్కువ ప్రభావం కనిపించే ప్రమాదం ఉంది.
రక్త హీనత : సొలానిన్ రక్త హీనతకు కారణం కావచ్చు. సొలానిన్ ఉన్న ఆలుగడ్డలు రక్త హీనతకు దారితీస్తాయి. రక్త హీనత కారణంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో వ్యాధులు వచ్చే అవకాశం అధికమవుతుంది.
చాలామంది ఆలుగడ్డల మొలకలు తీసి కడిగితే తినొచ్చని భావిస్తారు. కానీ మొలకలు తీసేసినంత మాత్రానా ఆలుగడ్డల్లో సొలానిన్ తొలగిపోదు. ఆలుగడ్డ అంతటా సొలానిన్ పాకి ఉంటుంది. కాబట్టి మొలకలు వచ్చిన ఆలుగడ్డలను మొలకలు తీసి తిన్నా ఆరోగ్యానికి హానికం. అయితే మొలకలు ఒకటి, రెండు ఉంటే మాత్రం అంతవరకు తొలగించి తినవచ్చట.
ఆలుగడ్డలను చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచడం మంచిది. అలాగే ఎండ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తేమ ఉన్న ప్రదేశంలో ఇవి వేగంగా మొలకలు వేస్తాయి. కనుక తడి తగలకుండా చూడాలి. ఎప్పుడూ నిలువ ఆలుగడ్డలు కాకుండా తాజావి తినడం ఉత్తమం.