White Mustard | రోజూ వంట చేసేందుకు అనేక రకాల పోపు దినుసులను వాడుతుంటారు. కూరల్లో వీటిని ఎక్కువగా వేస్తుంటారు. వాటిల్లో ఆవాలు కూడా ఒకటి. ఆవాలు అంటే సాధారణంగా అవి నల్లగా ఉంటాయి. కానీ మీకు తెలుసా..? వీటిల్లోనూ అనేక రకాలు ఉన్నాయి. అయితే మనకు మార్కెట్లో లభించే ఆవాలలో నలుపుతోపాటు తెలుపు రంగులోవి కూడా ఉంటాయి. ఇవి మరీ తెల్లగా ఉండవు, కాస్త క్రీమ్ కలర్లో ఉంటాయి. అయినప్పటికీ వీటిని తెల్ల ఆవాలు అనే పిలుస్తారు. అయితే నల్ల ఆవాలతోపాటు తెల్ల ఆవాలలోనే అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. తెల్ల ఆవాలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. ఇవి పోషకాలను అందించడమే కాక, వ్యాధులను నయం చేసేందుకు కూడా సహాయం చేస్తాయి.
తెల్ల ఆవాలను ఆహారంలో భాగం చేసుకుంటో నోట్లో ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే జీర్ణ రసాలు కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా ఆహారంలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు సులభంగా జీర్ణం అవుతాయి. తెల్ల ఆవాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఆకలి లేని వారు వీటిని తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. సాధారణంగా జ్వరం లేదా ఏదైనా వ్యాధి వచ్చిన కోలుకున్న వారికి ఆహారం తినాలనిపించదు. నోరంతా చేదుగా ఉంటుంది. కానీ తెల్ల ఆవాలను తినడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అలాగే ఇవి ఫైబర్‌ను అధికంగా కలిగి ఉంటాయి. కనుక వీటిని తింటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది.
తెల్ల ఆవాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అనేక ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. కనుక తెల్ల ఆవాలను తింటుంటే ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గుతాయి. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. వీటిని తినడం వల్ల అనేక రకాల మినరల్స్ మన శరీరానికి లభిస్తాయి. తెల్ల ఆవాల్లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది. అలాగే వీటిల్లో ఉండే మెగ్నిషియం నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోవడం తగ్గుతుంది. షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలోనూ మెగ్నిషియం సహాయం చేస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు తరచూ వీటిని తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
తెల్ల ఆవాలలో క్యాల్షియం కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. కనుక వీటిని వాడితే కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కీళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు. నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. తెల్ల ఆవాలను ఉపయోగించడం వల్ల ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. అలాగే వీటిల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కనుక ఇవి సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తాయి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. ఇలా తెల్ల ఆవాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని పొడిలా చేసి రోజూ ఆహారంలో కాస్త తీసుకోవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.