Saffron | అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు ఒకటి. ఇది లిల్లీ కుటుంబానికి చెందినది. కుంకుమపువ్వును సేకరించడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఇది ఎక్కువగా ఇరాన్, గ్రీస్, మొరాకో, స్పెయిన్, కాశ్మీర్, ఇటలీలలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనిని సేకరించడంతోపాటు పండించడం కూడా చాలా కష్టంతో కూడుకున్నది కనుక దీని రేటు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఖరీదైన వంటకాల్లో మాత్రమే దీనిని ఎక్కువగా వాడతారు. బిర్యానీ, కుక్కీస్, కేక్స్, స్వీట్స్ తయారీలో కుంకుమపువ్వును ఎక్కువగా వాడతారు. అలాగే కుంకుమపువ్వు ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఆధునిక ప్రకారం కుంకమపువ్వును కామోద్దీపనగా, డయాఫోరేటిక్ గా, కార్మినేటివ్ గా, ఋతుస్రావం కలిగించడానికి కూడా ఉపయోగించవచ్చు.
కుంకుమపువ్వును వాడడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు. కుంకుమపువ్వులో క్రోసిన్ అని పిలవబడే ముదురు నారింజ రంగులో ఉండే నీటిలో కరిగే కెరోటీన్ ఉంటుంది. ఇది మానవ క్యాన్సర్ కణాలు, అండాశయ కార్సినోమా, పెద్దప్రేగు అడెనోకార్సినోమా, మృదుకణజాల సార్కోమాలో అపోప్టోసిస్ ( ప్రోగ్రామ్డ్ సెల్ డెత్) ను ప్రేరేపిస్తుందని కనుగొనబడింది. కుంకుమపువ్వు ప్రాణాంతక క్యాన్సర్ కణాలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధనల ద్వారా వెల్లడించారు. అలాగే క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడే రోగనిరోధక కణాలైన లింఫోసైట్లు ఏర్పడటాన్ని కూడా ప్రేరేపిస్తుంది. అలాగే కుంకుమపువ్వు సారం వయస్సు పైబడడం వల్ల వచ్చే బలహీనతలను తగ్గించడంలో, వయసు పైబడడం వల్ల వచ్చే జ్ఞాపకశక్తి తగ్గుదలను తగ్గించే చికిత్సలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా కొందరు బాలికలు వయసు వచ్చినప్పటికీ వారిలో ఋతుక్రమం ప్రారంభమవ్వదు. అలాంటి వారికి పాలల్లో కుంకుమపువ్వు కలిపి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వారిలో హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. లైంగిక కోరికలు, లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్నవారికి కూడా కుంకుమపువ్వు సహాయపడుతుంది. నిద్రించే ముందు ఒక గ్లాస్ పాలలో చిటికెడు కుంకుమపువ్వు కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో కూడా కుంకుమపువ్వు మనకు సహాయపడుతుంది. పాలలో కలిపి కుంకుమపువ్వును తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుంది. జలుబు, జ్వరం వంటి వాటికి చేసే చికిత్సలో కూడా కుంకుమపువ్వు ప్రభావవంతంగా పని చేస్తుంది.
జలుబు, జ్వరం వంటి వాటితో బాధపడే వారికి పాలల్లో కలిపిన కుంకుమపువ్వును నుదిటిపై రాయాలి. ఇలా చేయడం వల్ల ఆయా సమస్యల నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే వంటకాల తయారీలో చాలా మంది కృత్రిమ రంగులను వాడుతూ ఉంటారు. అలాంటి కృత్రిమ రంగులకు ప్రత్యామ్నాయంగా కంకుమపువ్వు పనిచేస్తుంది. ఈ విధంగా కుంకుమపువ్వు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దీనిని తక్కువ మొత్తంలో తీసుకోవాలని వారు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని తీసుకోకపోవడమే మంచిదని వారు తెలియజేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అది విషపూరితం కూడా కావచ్చని కనుక దీనిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.