Biryani Disadvantages | ప్రస్తుతం దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా సరే ప్రజలు నాన్ వెజ్ రుచులను విడిచిపెట్టకుండా తింటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ లేదా యూట్యూబ్‌లో షార్ట్స్‌ను చూస్తున్న నెటిజన్లు వాటిల్లో వచ్చే ఫుడ్ వీడియోలను చూసి మైమరిచిపోతున్నారు. ఆ ఫుడ్స్‌ను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా వరకు రెస్టారెంట్లలో అనేక నాన్ వెజ్ వెరైటీలతోపాటు బిర్యానీ వెరైటీలు కూడా లభిస్తున్నాయి. అయితే ఘుమ ఘుమలాడే బిర్యానీని తినడం వరకు బాగానే ఉంటుంది. కానీ దాని రుచికి దాసోహం అయిపోయి బానిసగా మారితేనే కష్టం. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి జిహ్వా చాపల్యం తీర్చుకునేందుకు బిర్యానీని టేస్ట్ చేయవచ్చు. కానీ తరచూ బిర్యానీని తింటే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీని తరచూ తినడం మంచిది కాదని వారు సూచిస్తున్నారు.
బిర్యానీలో అధికంగా క్యాలరీలు ఉంటాయి. ఏ రకానికి చెందిన బిర్యానీ అయినా సరే కొంచెం అటు ఇటుగా క్యాలరీలు మాత్రం అధికంగానే ఉంటాయి. బిర్యానీ తయారీలో బియ్యం, మాంసం, నెయ్యి, అధికంగా నూనె, జీడిపప్పు వంటి వాటిని వాడుతారు. ఇవన్నీ అధికంగా క్యాలరీలను కలిగి ఉండే ఆహారాలే. కనుక బిర్యానీని తరచూ తింటే మన శరీరంలో పెద్ద ఎత్తున క్యాలరీలు చేరుతాయి. ఇవి కొవ్వుగా మారుతాయి. ఈ క్రమంలో తరచూ బిర్యానీని తింటే అధికంగా బరువు పెరిగిపోతారు. వ్యాయామం లేదా శారీరక శ్రమ చేస్తే ఓకే. లేదంటే తరచూ బిర్యానీని తింటే స్థూలకాయం వస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్ వ్యాధులకు కారణం అవుతుంది.
బిర్యానీలో కొవ్వులు అధికంగా ఉంటాయి. బిర్యానీలో అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. వండే వారు నాణ్యత లేని నెయ్యి లేదా పామాయిల్ వంటి వాటిని వాడితే అలాంటి బిర్యానీలో కొవ్వులు ఇంకా అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను పెంచుతాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్త నాళాల్లో కొవ్వు చేరుతుంది. ఇది హార్ట్ ఎటాక్‌లకు కారణం అవుతుంది. బిర్యానీలో ఉప్పు అధికంగా ఉంటుంది. ఇందులో సోడియం ఉంటుంది కనుక బిర్యానీని తరచూ తింటే మన శరీరంలో సోడియం స్థాయిలు సైతం పెరుగుతాయి. దీంతో బీపీ పెరుగుతుంది. ఇది హార్ట్ స్ట్రోక్‌లకు కారణం అవుతుంది. అలాగే కిడ్నీలపై భారం పడుతుంది. దీర్ఘకాలంలో కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది.
బిర్యానీని అధికంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అజీర్తి ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీ, గుండెలలో మంట, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే బిర్యానీలో ఉండే మసాలాల కారణంగా కొందరికి పొట్టలో తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుంది. ఇది విరేచనాలను కూడా కలిగిస్తుంది. బిర్యానీని తరచూ అధికంగా తినడం వల్ల జీవన శైలి సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌తోపాటు గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. బిర్యానీని తింటే కొందరికి పోషకాలు సరిగ్గా లభించవు. దీంతో పోషకాహార లోపం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కనుక బిర్యానీని తరచూ తినకూడదని, ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.