Okinava Diet | అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. నేటి ఫ్యాషన్ యుగంలో స్త్రీలు, పురుషులు సన్నగా నాజూగ్గా కనబడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే సన్నగా కనిపించేందుకు అనేక మార్గాలను వారు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా యువతీ యువకులు అధిక బరువును తగ్గించేందుకు అనేక డైట్లను పాటిస్తున్నారు. అయితే ఫాలో అయ్యేందుకు అనేక రకాల డైట్లు అందుబాటులో ఉన్నా ఒక్కో డైట్ ఒక్కొక్కరికి సెట్ అవుతుంది. కొందరికి కాదు. దీంతో బరువు తగ్గడం లేదని విచారిస్తుంటారు. అయితే జపాన్‌లోని చాలా మంది ప్రజలు పాటించే ఒకినవ డైట్‌ను పాటిస్తే కచ్చితంగా బరువు తగ్గవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ అసలు ఒకినవ డైట్ అంటే ఏమిటి.. ఇందులో భాగంగా ఎలాంటి ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జపాన్‌కు చెందిన చాలా మంది ప్రజలు ఒకినవ డైట్‌ను ఆచరిస్తారట. దీంతో సన్నబడడం చాలా తేలికని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్లో భాగంగా తీసుకునే ఆహారాల్ల పోషకాలు అధికంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. ఇక వాస్తవంగా చెప్పాలన్నా కూడా జపాన్ దేశ ప్రజలు అన్ని దేశ ప్రజల కన్నా కాస్త సన్నగానే ఉంటారు. వారు ఈ డైట్‌ను పాటించడమే అందుకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇక ఒకినవ డైట్‌ను పాటిస్తే జీవితకాలం కూడా పెరుగుతుందని, 100 ఏళ్ల పాటు ఎలాంటి రోగాలు రాకుండా జీవించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇందులో ఏమేం ఆహారాలను తీసుకోవాలంటే..
ఒకినవ డైట్లో భాగంగా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ తాము తీసుకునే ఆహారాల కన్నా 20 శాతం క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక వీటిని ఆహారంలో అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఆరోగ్యాన్ని అందివ్వడమే కాకుండా జీవిత కాలాన్ని పెంచుతాయి.
ఒకినవ డైట్లో భాగంగా మూడు వంతులు ధాన్యాలు, ఒక వంతు పిండి పదార్థాలను తీసుకోవాలి. ఈ రకమైన ఆహారం వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాల్లో ప్రధానంగా నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ కూడా ఒకటి. మొలకెత్తిన విత్తనాలను కూడా తీసుకోవచ్చు. చేపల్లోనూ క్యాలరీలు తక్కువగానే ఉటాయి. అలాగే గుడ్లు, మాంసం లేదా పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. ఒకినవ డైట్లో భాగంగా సోయా ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత కల్పించారు. సోయా పాలు, సోయా గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ప్రోటీన్లను, క్యాల్షియం మెగ్నిషియం వంటి మినరల్స్‌ను అందిస్తాయి. శరీరానికి శక్తి వచ్చేలా చేస్తాయి.
స్థూలంగా చెప్పాలంటే ఒకినవ డైట్లో కేవలం క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. అది ఏ ఆహారం అయినా కావచ్చు. కానీ జంక్ ఫుడ్ మాత్రం తినకూడదు. నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ప్రకృతి సహజసిద్ధమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒకినవ డైట్ అద్భుతంగా పనిచేస్తుంది. అప్పుడు బరువు తగ్గడమే కాదు, వ్యాధులు కూడా తగ్గిపోతాయి. ఆయుర్దాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.