Surya Namaskar | ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. చాలా మంది ప్రస్తుతం కూర్చుని పనిచేసే ఉద్యోగాలనే చేస్తున్నారు. దీంతో శారీరక శ్రమ తగ్గుతోంది. దీని వల్ల లైఫ్ స్టైల్ వ్యాధులు వస్తున్నాయి. అధికంగా బరువు పెరిగి గుండె జబ్బులు, డయాబెటిస్ వస్తున్నాయి. చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. కనుక రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం అయినా చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వ్యాయామంలో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో యోగా కూడా ఒకటి. వ్యాయామం చేసేందుకు తీరిక లేని వారు యోగా చేయవచ్చు. యోగాలో పలు ఆసనాలు వేయడంతోపాటు సూర్య నమస్కారాలు చేయడం వల్ల చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు సూర్య నమస్కారాలు ఎంతగానో దోహదం చేస్తాయని వారు అంటున్నారు.
సూర్య నమస్కారాలు చేయడం అంటే సూర్యుడికి ఎదురుగా నిలబడి ఉదయం నమస్కారం చేయడం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. సూర్య నమస్కారాలను చేయడం అంటే కొన్ని రకాల యోగా భంగిమలను ఒకేసారి చేస్తూ పోవాలి. ఇలా ఆయా భంగిమలను పలుమార్లు రిపీట్ చేయాలి. దీన్నే సూర్య నమస్కారాలు చేయడం అంటారు. ఉదయం సూర్య రశ్మి తగిలేలా ఈ నమస్కారాలను చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటి వల్ల కండరాలు, నరాలు సాగే గుణాన్ని పొందుతాయి. దీంతో వృద్ధాప్యంలో కండరాలు పట్టుకుపోకుండా ఉంటాయి. సులభంగా ఎటంటే అటు వంగుతాయి. దీంతో కండరాల నొప్పులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే సూర్య నమస్కారాలు చేస్తే గాయాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
సూర్య నమస్కారాలు చేయడం అన్నది లో-ఇంపాక్ట్ కార్డియో వ్యాయామం కిందకు వస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల తేలికపాటి రన్నింగ్ చేసిన అనుభూతి కలుగుతుందని అంటున్నారు. దీంతో గుండె కొట్టుకునే వేగం కాస్త పెరుగుతుంది. ఫలితంగా రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధిత వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు శ్వాస మీద కూడా దృష్టి పెడతారు. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. ఆందోళన నుంచి బయట పడవచ్చు. మైండ్ క్లియర్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏదైనా అంశంపై ఏకాగ్రత పెట్టగలుగుతారు. మెంటల్ క్లారిటీ లభిస్తుంది. ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటారు.
సూర్య నమస్కారాలు చేస్తే శరీరం మొత్తానికి వ్యాయామం అవుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. కండరాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలోని కండరాలు అన్నీ పటుత్వాన్ని పొందుతాయి. కండరాలు పటిష్టంగా మారుతాయి. ముఖ్యంగా చేతులు, కాళ్లు, ఛాతి, వెన్ను భాగంలో ఉండే కండరాలు దృఢంగా మారుతాయి. ఆయా భాగాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. శరీరం చక్కని ఆకృతిని పొందుతుంది. పొట్ట దగ్గరి కొవ్వుతో బాధపడుతున్నవారు సూర్య నమస్కారాలను రోజూ చేస్తుంటే కొవ్వును త్వరగా కరిగించుకోవచ్చు. పొట్ట ఫ్లాట్గా మారుతుంది. అలాగే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. ఇలా సూర్య నమస్కారాలను రోజూ చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.