Sweet Lime | బత్తాయి పండ్లు.. చూసేందుకు అచ్చం నారింజ పండ్లలాగే ఉంటాయి. కానీ నారింజ పండ్లంత తియ్యగా ఉండవు. మరీ పుల్లగా కూడా ఉండవు. కానీ ఇవి రుచిగా ఉంటాయి. అనేక పోషకాలను కలిగి ఉంటాయి. చాలా మంది రహదారుల పక్కన ఉండే జ్యూస్ సెంటర్లలో బత్తాయి రసం తాగేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ పండ్లు కాస్త తీపి, పులుపు రుచి కలిగి ఉంటాయి. చూసేందుకు పెద్ద నిమ్మ పండు సైజులో ఉంటాయి. బత్తాయి పండ్లనే స్వీట్ లైమ్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్ల గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది. బత్తాయి పండ్లను చాలా మంది నేరుగా తింటారు. కానీ ఈ పండ్లను జ్యూస్‌గా తాగితేనే చాలా బాగుంటుంది. బత్తాయి పండ్ల రసాన్ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. బత్తాయి పండ్లను తింటున్నా లేదా జ్యూస్‌ను తాగుతున్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
బత్తాయి పండ్లలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. జలుబు, జ్వరం వచ్చినప్పుడు రోజుకు 2 సార్లు ఈ పండ్ల జ్యూస్‌ను తాగాలి. దీంతో త్వరగా కోలుకుంటారు. శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. శరీరం కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందవచ్చు. నీరసం, అలసట తగ్గుతాయి. చురుగ్గా మారుతారు. బత్తాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది దంతాలు, చిగుళ్లను దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లను తింటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గిపోతుంది. బత్తాయి పండ్లను తింటే నోట్లో లాలాజలం అధికంగా స్రవించబడుతుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని సులభంగా, త్వరగా జీర్ణం చేస్తుంది. దీంతో అజీర్తి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
బత్తాయి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తింటే మలబద్దకం తగ్గుతుంది. రోజూ ఉదయం సుఖ విరేచనం అవుతుంది. బత్తాయి పండ్లలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి జీర్ణ రసాలు, ఆమ్లాలు విడుదల అయ్యేందుకు సహాయం చేస్తాయి. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఏదైనా వ్యాధి వచ్చిన వారు బత్తాయి పండ్ల రసాన్ని సేవిస్తుంటే త్వరగా శక్తి లభించి రోగం నుంచి త్వరగా కోలుకుంటారు. ఉదయం జాగింగ్ లేదా వాకింగ్, యోగా, వ్యాయామం చేసిన అనంతరం ఒక గ్లాస్ బత్తాయి పండ్ల రసం సేవిస్తే శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. మళ్లీ ఉత్సాహంగా మారుతారు. రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. ఎంత పనిచేసినా నీరసం, అలసట రావు. బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా టీ, కాఫీ వంటివి తాగకుండా బత్తాయి పండ్ల రసం తాగితే ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బత్తాయి పండ్లలో ఉండే ఆమ్లాలు జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతాయి. దీంతో జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అజీర్తితో బాధపడేవారికి బత్తాయి రసం ఔషధంగా పనిచేస్తుంది. బత్తాయి పండ్లలో ఉండే పొటాషియం విరేచనాలను తగ్గిస్తుంది. బాధితులు త్వరగా కోలుకునేలా చేస్తుంది. కామెర్లు వచ్చిన వారు ఈ పండ్ల రసం తాగుతుంటే త్వరగా కోలుకుంటారు. వాంతులు, తలతిరగడం వంటి సమస్యలు ఉన్నవారు బత్తాయి పండ్ల రసం తాగితే మంచిది. గొంతు సంబంధ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు బత్తాయి రసం తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. రోజూ ఈ జ్యూస్‌ను సేవించడం వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. బ్లడ్ క్లాట్స్ కరిగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా బత్తాయి పండ్లు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. కనుక ఇవి కనబడితే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి.