Left Over Rice | దక్షిణ భారత దేశ ప్రజలకు అన్నం ప్రధాన ఆహారం. దీన్ని ఆయా ప్రాంతాల వారు వివిధ రకాలుగా వండుకుని తింటుంటారు. పలు ఆసియా దేశ వాసులు కూడా బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ మనలో చాలా మంది రాత్రి పూట మిగిలిన అన్నాన్ని మరుసటి రోజు ఉదయం లేదా మధ్యాహ్నం తింటుంటారు. ఫ్రిజ్లో పెట్టి వేడి చేసి మరీ తింటారు. అన్నం ఎక్కువగా మిగిలితే దాన్ని పడేసేందుకు మనసు ఒప్పుకోదు. కనుక దాన్ని మళ్లీ వేడి చేసి లేదా తాళింపు వేసి, పులిహోర లేదా ఫ్రైడ్ రైస్ వంటివి చేసి తింటారు. కానీ ఇలా మిగిలిపోయిన అన్నాన్ని తినడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మిగిలిపోయిన అన్నంలో బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది. బేసిలస్ సెరియస్ అనే బ్యాక్టీరియా అన్నంలో అమాంతం పెరుగుతుంది. అలాంటి అన్నాన్ని తింటే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా అంత త్వరగా చావదు. అన్నాన్ని ఫ్రిజ్ లో ఉంచినా, వేడి చేసినా కూడా ఈ బ్యాక్టీరియా అంత త్వరగా చనిపోదు. పైగా ఇది సమయం గడిచే కొద్దీ వృద్ధి చెందుతుంది కనుక అలాంటి అన్నాన్ని తింటే శరీరానికి విషంగా మారుతుంది. మిగిలిపోయిన అన్నాన్ని తినడం వల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇది కొందరిలో ఫుడ్ పాయిజనింగ్ను కలిగిస్తుంది. అలాగే కొందరిలో పలు అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి.
మిగిలిపోయిన అన్నాన్ని తింటే కొందరికి వికారంగా ఉంటుంది. వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు సంభవిస్తాయి. ఈ లక్షణాలు మొదలైన తరువాత 6 నుంచి 15 గంటల వరకు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు తగ్గేందుకు 24 గంటల సమయం కూడా పడుతుంది. కానీ అంతకు మించినా కూడా ఈ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అయితే అన్నాన్ని వండిన వెంటనే చాలా సేపు అలాగే ఉంచకుండా వెంటనే తినేయాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడు తింటేనే అందులో ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. కనుకనే ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలని వైద్యులు చెబుతుంటారు. అలాగే మీ కుటుంబానికి ఎంత అన్నం సరిపోతుందో అంతే వండుకుని తినడం మంచిది. దీంతో కాస్తంత మిగిలినా ఏమీ కాదు. ఎవరు ఎంత తింటారు అన్న విషయం తెలుసుకుని మరీ వండితే అన్నం మిగిలిపోకుండా చూసుకోవచ్చు.
అన్నం వండిన తరువాత సమయం గడిచే కొద్దీ అందులో బ్యాక్టీరియా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి అన్నాన్ని వండాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తింటేనే మంచిది. అన్నాన్ని వండిన తరువాత తినడం ఆలస్యం అవుతుంది అనుకుంటే వెంటనే చల్లార్చి ఫ్రిజ్లో పెట్టవచ్చు. ఉష్ణోగ్రత 5 డిగ్రీల కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తరువాత అన్నాన్ని బయటకు తీసి వేడి చేసి వెంటనే తినాలి. మళ్లీ ఆలస్యం చేయవద్దు. ఇలా అన్నాన్ని సురక్షితంగా నిల్వ చేసి తినవచ్చు. అలాగే కొందరు అన్నాన్ని పదే పదే వేడి చేసి మరీ తింటారు. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. సరిగ్గా నిల్వ చేస్తే అన్నాన్ని ఒకసారి వేడి చేసి తినవచ్చు. అంతకు మించి మళ్లీ మళ్లీ అన్నాన్ని వేడి చేసి తినకూడదు. ఈ విధంగా అన్నం విషయంలో జాగ్రత్తలను పాటిస్తే ఫుడ్ పాయిజనింగ్ కాకుండా జాగ్రత్త పడవచ్చు.