Fridge | ఈ రోజుల్లో చాలా మంది ఫ్రిజ్‌లను కొనుగోలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాదు. ఒకప్పుడు కేవలం ధనికుల ఇళ్లలోనే ఫ్రిజ్ లు ఉండేవి. కానీ ఇప్పుడు సామాన్యులు కూడా ఈఎంఐ పద్ధతిలో వీటిని కొంటున్నారు. అయితే ఫ్రిజ్ కొనడం వరకు బాగానే ఉంటుంది. కానీ అందులో దేన్ని పడితే దాన్ని పెడుతున్నారు. సాధారణంగా మార్కెట్లో మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తుంటాం. అయితే అవి పాడైపోతాయేమోనన్న భయంతో చాలా మంది అన్ని రకాల ఆహారాలను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ వాస్తవానికి అలా చేయడం మంచిది కాదు. కొన్ని రకాల ఆహారాలను అసలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా పెడితే వాటిల్లో ఉండే పోషకాలు నశిస్తాయి. అలాంటి ఆహారం తింటే మనకు పడకపోవచ్చు. కొందరికి ఫుడ్ పాయిజన్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది. కనుక ఫ్రిజ్‌లో అన్ని ఆహారాలను పెట్టకూడదు.
కూరగాయలు కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ కీరదోసను కచ్చితంగా కొంటారు. అయితే వాటిని ఫ్రిజ్‌లో అసలు పెట్టవద్దు. ఎందుకంటే ఫ్రిజ్‌లో చల్లదనానికి అవి మెత్తబడిపోతాయి. సొట్టలు పడి తాజాదనం పోతుంది. కట్ చేసి పెడితే నీరుకారిపోతాయి. గది ఉష్ణోగ్రతలోనే కీరదోస తాజాగా ఉంటుంది. కనుక వీటిని ఎట్టి పరిస్థితిలోనూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలాగే టమాటాలను ఫ్రిజ్‌లో పెడితే చల్లదనానికి పైపొర పాడవుతుంది. కిచెన్ టెంపరేచర్లోనే వాటిని ఉంచాలి. అందువల్ల మరీ ఎక్కువగా టమాటాలను కొనకుండా ఎంత అవసరమో అంత వరకు తాజాగా కొనుగోలు చేయడం మంచిది.
బాదంపప్పు, వాల్ నట్స్, ఖర్జూరాలు, జీడిపప్పు లాంటి వాటిని ఫ్రిజ్‌లో పెడితే రుచి పోతుంది. గాలి చొరబడని డబ్బా లేదా సీసాలో నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్‌ను ఉంచి గట్టిగా మూత పెట్టాలి. ఫ్రిజ్ బయట వేడి ఎక్కువగా లేని చోట ఆ డబ్బాను ఉంచితే రుచి ఏమాత్రం తగ్గదు. అలాగే బ్రెడ్ స్లైస్కి అద్దుకుని తినే చాక్లెట్ స్ప్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెడితే గట్టి పడుతుంది. దీంతో బ్రెడ్ స్లైస్ మీద చక్కగా పరుచుకోదు. రుచి కూడా మారుతుంది. చాక్లెట్ స్ర్పెడ్ని కూడా టైట్ జార్ లో ఉంచి మూత గట్టిగా పెట్టాలి.
వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెడితే తేమకు పాడైసోతాయి. రాత్రి వంటకు లేదా మర్నాడు లంచ్‌కు ఒలిచి సిద్ధం చేసి పెట్టుకున్న వెల్లుల్లిని తప్ప మామూలుగానైతే బయటే ఉంచాలి. బయట ఉంచితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే తేనెను కూడా ఫ్రిజ్ లో పెట్టరాదు. తేనె ఫ్రిజ్‌లోని చల్లదనానికి చిక్కబడిపోతుంది. అందులో ఉండే చక్కెర కణాలన్నీ ఉండలు చుట్టుకుపోతాయి. అదేవిధంగా ఉల్లిపాయలను వెలుతురు సోకని చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఫ్రిజ్‌లో పెట్టవద్దు. పెడితే మెత్తబడి చెమ్మగిల్లుతాయి. అలాగే ఫ్రిజ్ లోని చల్లదనం ఆలుగడ్డలోని పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది. దీంతో ఆలు రుచి మారుతుంది. రంగు కూడా మారుతుంది. కనుక ఆలుగడ్డలను బయటి వాతావరణంలోనే ఉంచాలి. అలాగే బ్రెడ్, పుచ్చకాయ, అరటి పండ్లు, కేక్ వంటి వాటిని కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెడితే పాడవుతాయి.