Neem Oil | ఆయుర్వేదంలో వేపకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. వేపాకులు, బెరడు, పువ్వులు, పండ్లు.. ఇలా అన్ని భాగాల్లోనూ ఔషధ గుణాలు సమృద్దిగా ఉంటాయి. వాటిని అనేక వ్యాధులను నయం చేసేందుకు భిన్న రకాలుగా ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే వేప నూనె ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగంలో ఉంటుంది. వేప పండ్లపై అధిక పీడనంలో ఒత్తిడి కలిగించడం ద్వారా వేప నూనెను తయారు చేస్తారు. వేప నూనె వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వేప నూనెలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. అజాడిరాక్టిన్, నింబిన్, నింబిడిన్, గెడునిన్, నింబొలైడ్ అనే బయో యాక్టివ్ సమ్మేళనాలు వేప నూనెలో ఉంటాయి. ఇవి సహజసిద్ధమైన యాంటీ మైక్రోబియల్ కారకాలుగా పనిచేస్తాయి. దీంతో ఇన్ ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. రోగాలు రాకుండా ఉంటాయి.
వేప నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలు, చర్మ ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తాయి. చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. వేప నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు సైతం ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు, గోర్లు, పాదాలు, గజ్జలు వంటి భాగాల్లో వచ్చే ఫంగస్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఆయా భాగాల్లో ఉండే దురద, దద్దుర్లు తగ్గిపోతాయి. బ్యాక్టీరియా, ఫంగస్, ఈస్ట్ పెరగకుండా చేసే గుణం వేప నూనెలో ఉంటుంది. అందువల్ల ఆయా చర్మ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వేప నూనెలో యాంటీ వైరల్ గుణాలు సైతం అధికంగానే ఉంటాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఈ నూనె పలు రకాల వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తేలింది. దీని వల్ల జ్వరం వంటి వాటిని తగ్గించుకోవచ్చు.
వేప నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు మొటిమలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. మొటిమలు ఉండే ప్రాంతంలో ఎరుపుదనం, దురద, వాపులు తగ్గుతాయి. తామర, గజ్జి, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు సైతం వేప నూనె అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని రాయడం వల్ల వాపులు, దురదలు, మంట తగ్గిపోతాయి. వేప నూనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మానికి తేమను అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మానికి తేమను అందించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
వేప నూనెను వాడడం వల్ల ముఖంపై ఉండే ముడతలు, వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. సహజసిద్ధమైన నిగారింపు వచ్చి యవ్వనంగా కనిపిస్తారు. గాయాలు, పుండ్లను మానేలా చేయడంలోనూ వేప నూనె అద్భుతంగా పనిచేస్తుంది. వేప నూనెను అన్ని రకాల చర్మాలు ఉన్నవారు వాడవచ్చు. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ ఉన్నవారు జిడ్డుగా అవుతుందని భయ పడాల్సిన పనిలేదు. దీన్ని వాడితే జిడ్డుగా ఉన్న చర్మం సాధారణ స్థితికి వస్తుంది. అధికంగా స్రవించే నూనెల ఉత్పత్తి తగ్గుతుంది. వేప నూనెను వాడితే పొడి చర్మం తేమగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. వేప నూనెను నేరుగా చర్మంపై రాయవచ్చు. లేదా ఏదైనా పదార్థంలో కలిపి కూడా వాడుకోవచ్చు. పెరుగు, పసుపు, తేనె, నిమ్మరసం, చల్లని పాలు, టమాటా గుజ్జు, బొప్పాయి గుజ్జు, కొబ్బరినూనె వంటి వాటిల్లో కలిపి ఆయా సమస్యలకు ఔషధంగా వాడుకోవచ్చు.