Red Rice | దక్షిణ భారతదేశంతోపాటు ఆసియాలోని అనేక దేశాలకు అన్నమే ప్రధాన ఆహారంగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే బియ్యంతో అనేక రకాల వంటకాలను కూడా చేసి తింటుంటారు. అయితే ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు, ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా తెల్ల బియ్యం తినకూడదని, బ్రౌన్ రైస్‌ను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది బ్రౌన్ రైస్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే బ్రౌన్ రైస్ మాత్రమే కాకుండా మరో రైస్ వెరైటీ కూడా ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే రెడ్ రైస్. ఇది మదురు ఎరుపు రంగులో ఉంటుంది. చూసేందుకు అంతగా ఆకర్షణీయంగా ఉండదు. కానీ ఈ రైస్‌ను తింటే బోలెడు ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రెడ్ రైస్‌లో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అందువల్లే రెడ్ రైస్‌కు ఆ రంగు వచ్చింది. ఆంథో సయనిన్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి బెర్రీ పండ్లతోపాటు ఎరుపు రంగు ఆహారాల్లో అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే బ్రౌన్ రైస్‌తో పోలిస్తే రెడ్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఈ ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారంపై నియంత్రణ ఏర్పడుతుంది. ఆహారం అధికంగా తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
ఇతర రైస్ వెరైటీలతో పోలిస్తే రెడ్ రైస్ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ చాలా తక్కువ. ఈ అందువల్ల ఈ రైస్‌ను తింటే షుగర్ లెవల్స్ పెరగవు. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ రైస్‌ను నిరభ్యంతరంగా తినవచ్చు. పైగా ఈ రైస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి రెడ్ రైస్ ఎంతో మేలు చేస్తుంది. రెడ్‌రైస్‌లో అధికంగా ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
రెడ్ రైస్‌లో అనేక మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ రైస్‌లో ఉండే ఐరన్ రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఈ రైస్‌లో మాంగనీస్, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. కండరాలకు ప్రశాంతత లభిస్తుంది. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెడ్ రైస్‌లో ఉండే ఫాస్ఫరస్ ఎముకలను బలంగా మారుస్తుంది. జింక్ కూడా ఈ రైస్‌లో అధికంగానే ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. రెడ్ రైస్‌లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ రైస్‌ను తింటే వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా రెడ్ రైస్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.