Rambutan Fruits | చూసేందుకు మనకు కొన్ని రకాల పండ్లు అంత ఆకర్షణీయంగా కనిపించవు. కానీ అలాంటి పండ్లు ఇచ్చే ప్రయోజనాలు మాత్రం బోలెడన్ని ఉంటాయి. వాటిల్లో రాంబుటాన్ అనే పండ్లు కూడా ఒకటి. ఇవి పురుగులను పోలిన ఆకారంలో ఉంటాయి. కనుక వీటిని తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. ఈ పండ్లను మీరు సూపర్ మార్కెట్లలో చూసే ఉంటారు. అయితే ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. రాంబుటాన్ పండ్లను పోషకాలకు నెలవుగా చెప్పవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వీటిల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండ్ల ద్వారా మనకు లభిస్తాయి. ఇవి మనకు రోగాలు రాకుండా చూస్తాయి. పోషణను అందిస్తాయి. అనేక వ్యాధుల నుంచి బయట పడేస్తాయి.
రాంబుటాన్ పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీరానికి కావల్సిన ద్రవాలు లభిస్తాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. బరువును నియంత్రణలో ఉంచుతాయి. ఈ పండ్లను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. రాంబుటాన్ పండ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి.
రాంబుటాన్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ ర్యాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి రక్షిస్తాయి. దీంతో చర్మం సాగే గుణాన్ని పొందుతుంది. దీని వల్ల చర్మంపై ఉండే ముడతలు, గీతలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. చర్మం ఎల్లప్పుడూ యంగ్‌గా ఉంటుంది. రాంబుటాన్ పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల ఈ పండ్లను తింటే నీరసం, అలసట వెంటనే తగ్గుతాయి. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. ఈ పండ్లలో ఉండే విటమిన్లు శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీని వల్ల శరీరం రోజంతా యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. ఎంత పనిచేసినా అలసట రాదు.
ఈ పండ్లలో క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, ఇతర అవసరమైన మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. ఎముకల్లో సాంద్రత పెరిగేలా చేస్తాయి. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారించవచ్చు. అలాగే ఎముకలు సులభంగా విరిగిపోకుండా చూసుకోవచ్చు. ఈ పండ్లను తింటే పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఇలా రాంబుటాన్ పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఇకపై ఈ పండ్లు మీకు కనిపిస్తే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి.