Ponnaganti Kura | వర్షాకాలం వస్తూనే అనేక రోగాలను తీసుకువస్తుంది. ఏడాదిలో ఈ కాలంలోనే చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుంటారు. రోగాలు వచ్చిన వారితో ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటళ్లు అన్నీ కిక్కిరిసిపోతుంటాయి. అయితే రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే ఎలాంటి రోగాన్ని అయినా సరే తట్టుకునే శక్తి లభిస్తుంది. అందుకని ఈ సీజన్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తినాలి. అలాంటి ఆహారాల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. వర్షాకాలంలో చాలా మంది మిర్చి బజ్జీల లాంటి చిరు తిళ్లను తినేందుకు ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఆరోగ్యకరమైన ఆహారాల గురించి పట్టించుకోరు. ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతి సీజన్లోనూ తినాల్సిందే. దీంతో ఇమ్యూనిటీ పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు కూడా పొన్నగంటి కూర ఎంతగానో పనిచేస్తుంది. దీన్ని ఈ సీజన్లో ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
100 గ్రాముల పొన్నగంటి కూరను తింటే లభించే క్యాలరీలు దాదాపుగా సున్నా అనే చెప్పాలి. ఈ ఆకుకూరను తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, సి, బి2, బి3 కూడా లభిస్తాయి. ఈ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, జింక్, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ పోషకాహార లోపాన్ని తగ్గిస్తాయి. శరీరానికి పోషణ లభించేలా చేస్తాయి. దీంతో రోగాల బారిన పడకుండా ఉంటారు. పొన్నగంటి కూరలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. అందువల్ల ఈ ఆకుకూరను తింటే కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు. కంటి రెటీనా సురక్షితంగా ఉంటుంది. కంటి చూపు తక్కువగా ఉన్నవారు ఈ ఆకుకూరను రోజూ తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
పొన్నగంటి కూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. పొట్టలోని అసౌకర్యం తొలగిపోతుంది. పొన్నగంటి కూరలో అధికంగా ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే విటమిన్లు ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మ కణాలు సంరక్షించబడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు లభిస్తుంది. మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ ఆకులు లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను తరచూ తింటుంటే లివర్లో ఉండే కొవ్వు కరుగుతుంది. వ్యర్థాలు బయటకు పోయి లివర్ క్లీన్ అవుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది.
ఈ ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. వీటిల్లో ఉండే ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కలిగే నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అధిక బరువు ఉన్నవారు ఈ ఆకులను రోజూ తింటే ఎంతో ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. పొన్నగంటి కూరలో ఉండే ఐరన్ రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఇలా ఆకుకూర వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు.