Plums | ఆరోగ్యంగా ఉండేందుకు గాను తరచూ పండ్లను తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పండ్లను తరచుగానే కాక రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు కూడా సూచిస్తుంటారు. అయితే మనకు సీజన్ల వారిగా లభించే పండ్లు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా లభించే పండ్లు కూడా అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్లమ్స్ (Plums) కూడా ఒకటి. ఇవి చూసేందుకు పర్పుల్ రంగులో ఉంటాయి. నలుపు రంగులో ఉండే ప్లమ్స్ కూడా మనకు లభిస్తాయి. ఒకప్పుడు ఈ పండ్లు కేవలం సూపర్ మార్కెట్లలోనే లభించేవి. కానీ ఇప్పుడు దాదాపుగా చాలా వరకు ఫ్రూట్ స్టాల్స్లోనూ ఈ పండ్లను విక్రయిస్తున్నారు. వీటి ధర కాస్త ఎక్కువే. కానీ ఈ పండ్లు అందించే ప్రయోజనాలు మాత్రం అమోఘమనే చెప్పాలి.
ప్లమ్స్ పండ్లలో పాలిఫినాల్స్, ఆంథో సయనిన్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో కణాలకు నష్టం జరగకుండా చూసుకోవచ్చు. క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వృద్ధాప్యంలో చాలా మంది అల్జీమర్స్ బారిన పడుతుంటారు. కానీ ప్లమ్స్ను తినడం వల్ల ఈ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అలాగే ప్లమ్స్ లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని తగ్గించేందుకు సహాయ పడుతుంది. కొలెస్ట్రాల్ కరిగేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) పెరుగుతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
ప్లమ్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజూ రాత్రి పూట ఒక ప్లమ్ను తింటే మరుసటి రోజు సుఖంగా విరేచనం అవుతుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అజీర్తి తగ్గుతుంది. తిన్న ఆహారాన్ని శరీరం సులభంగా జీర్ణం చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక ప్లమ్స్ రుచికి కాస్త పుల్లగా, తియ్యగా ఉంటాయి. అయినప్పటికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ చాలా తక్కువ. పైగా ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్ పెరగవు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ప్లమ్స్లో మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ కె, ఫాస్ఫరస్, మెగ్నిషియం, పొటాషియం ఈ పండ్లలో అధికంగా ఉంటాయి. కనుక రోజూ ఈ పండ్లను తింటే ఎముకల సాంద్రత పెరిగి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. విరిగిన ఎముకలతో బాధపడుతున్నవారు ఈ పండ్లను తింటే త్వరగా ఎముకలు అతుక్కునేలా చేయవచ్చు.
ప్లమ్స్లో ఉండే పాలిఫినాల్స్ న్యూరో ప్రొటెక్టివ్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక ఇవి జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి. ఏకాగ్రత పెరిగేలా చేస్తాయి. దీంతో మెదడు యాక్టివ్గా మారి ఉత్తేజంగా పనిచేస్తుంది. బద్దకం పోతుంది. ఏ పనినైనా చురుగ్గా పూర్తి చేస్తారు. ప్లమ్స్లో విటమిన్లు సి, ఇ ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. సూర్య కిరణాలతోపాటు ఫ్రీ ర్యాడికల్స్ వల్ల చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. చర్మం సాగే గుణం పెరిగేలా చేస్తాయి. దీంతో చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. ప్లమ్స్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో శరీరం రోగాలు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇలా ప్లమ్స్ను తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు.