Passion Fruit | మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి. కొన్ని రకాల పండ్లను చూస్తాం కానీ అవి అందించే ప్రయోజనాలు తెలియవు. అలాంటి పండ్లలో ప్యాషన్ ఫ్రూట్ కూడా ఒకటి. దీన్ని చాలా మంది చూసే ఉంటారు. లోపలంతా గుజ్జు లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ పండు నారింజ పండులా అనిపిస్తుంది. ప్యాషన్ ఫ్రూట్ వాస్తవానికి మనకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ప్యాషన్ ఫ్రూట్‌ను 100 గ్రాముల మోతాదులో తింటే సుమారుగా 97 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో 73 గ్రాముల మేర నీరు ఉంటుంది. 23 గ్రాముల పిండి పదార్థాలు, 10 గ్రాముల ఫైబర్, ప్రోటీన్లు 2 గ్రాములు ఉంటాయి. స్వల్ప మోతాదులో కొవ్వులు, విటమిన్లు సి, ఎ, బి9, కె, బి2, బి3, బి6లతోపాటు పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, సెలీనియం అధిక మొత్తంలో ఉంటాయి. అందువల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు ఈ పండ్లను తింటే ఎంతో మేలు జరుగుతుంది.
ప్యాషన్ ఫ్రూట్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. బీటా కెరోటిన్, పాలిఫినాల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులు తగ్గుతాయి. కణాలు రక్షించబడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఈ పండ్లలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను బయటకు పంపిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఈ పండ్లను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది.
ప్యాషన్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది కనుక రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. సీజనల్ గా వచ్చే ఇన్ఫెక్షన్లతోపాటు దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండ్లలో అధికంగా ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తింటే కొలెస్ట్రాల్ తగ్గి రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు. గుండెకు ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
ఈ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. షుగర్‌ను నియంత్రణలో ఉంచుకునేందుకు సహాయం చేస్తాయి. ఈ పండ్లను తింటే విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వయస్సు మీద పడడం వల్ల కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా చూస్తుంది. ప్యాషన్ ఫ్రూట్‌ను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇలా ప్యాషన్ ఫ్రూట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.