Lasora Fruit | విదేశాల నుంచి వచ్చే పండ్ల కన్నా మన దగ్గర స్థానికంగా లభించే కొన్ని రకాల పండ్లలోనే పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ అలాంటి పండ్ల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి పండ్లలో లసోరా పండ్లు కూడా ఒకటి. ఇవి చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండవు. కానీ ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అమోఘమనే చెప్పాలి. లసోరా పండ్లనే గ్లూ బెర్రీ లేదా ఇండియన్ చెర్రీ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లను అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. మనకు రహదారుల పక్కన చెట్లకు ఈ కాయలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఇవి ఔషధ గుణాలను కలిగి ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియదు. లసోరా పండ్లలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్‌ను ఈ పండ్లు కలిగి ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటే అనేక లాభాలను పొందవచ్చు.
లసోరా పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఈ పండ్లను తింటుంటే అన్ని రకాల కంటి సమస్యలు తగ్గిపోతాయి. లసోరా పండ్లలో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. లసోరా పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. బీపీ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. లసోరా పండ్లలో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ పండ్లలో ఫాస్ఫరస్, జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు త్వరగా అతుక్కునేలా చేస్తాయి. విరిగిన ఎముకలతో బాధపడుతున్నవారు తరచూ ఈ పండ్లను తింటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకలకు బలం కలుగుతుంది. లసోరా పండ్లలో ప్రోటీన్లు సైతం ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతోపాటు కండరాలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్దకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. లసోరా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. కణజాలం దెబ్బ తినకుండా రక్షిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
లసోరా పండ్లను తింటే దగ్గు, గొంతు నొప్పి, గొంతులో గరగర, మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా ఉన్నవారు ఈ పండ్లను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల వాపులను తగ్గిస్తాయి. దీంతో ఆస్తమా నుంచి బయట పడవచ్చు. లసోరా పండ్లలో యాంటీ హైపర్ టెన్సివ్ గుణాలు ఉంటాయి. అంటే ఈ పండ్లను తింటుంటే బీపీ నియంత్రణలో ఉంటుందన్నమాట. లసోరా పండ్లు షుగర్ లెవల్స్‌ను సైతం తగ్గించగలవు. ఈ పండ్లలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. తరచూ ఈ పండ్లను తింటుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. లసోరా పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను శుభ్రం చేస్తాయి. లివర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు పోయేలా చేస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా ఈ పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక ఈ పండ్లు మీకు కనిపిస్తే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి.