Fenugreek Leaves | భారతీయులు ఎంతో కాలం నుంచే మెంతులను తమ వంట ఇంటి పోపు దినుసులుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఆయుర్వేద ప్రకారం మెంతుల్లోనే కాదు, మెంతి ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మెంతులు తింటే కొందరికి వికారంగా అనిపిస్తుంది. కానీ అలాంటి వారు మెంతి ఆకులను తినవచ్చు. దీంతో కూడా అనేక లాభాలు కలుగుతాయి. మెంతి ఆకుల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల మెంతి ఆకులను తింటే సుమారుగా 50 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 4.4 గ్రాములు, ఫైబర్ 2 గ్రాములు, పిండి పదార్థాలు 6 గ్రాములు, కొవ్వులు 1 గ్రాము లభిస్తాయి. అలాగే మెంతి ఆకుల్లో విటమిన్లు సి, ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు బి1, బి2, బి3, బి6 అధికంగా ఉంటాయి. ఐరన్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, మెగ్నిషియం, మాంగనీస్ వంటి మినరల్స్ కూడా మెంతి ఆకుల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి.
షుగర్ ఉన్నవారికి మెంతి ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. మెంతి ఆకుల్లో గలాక్టోమనన్ అనే ఒక రకమైన ఫైబర్ ఉంటుంది. దీని వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలు రక్తంలో గ్లూకోజ్‌గా మారగానే శరీరం వెంటనే శోషించుకుంటుంది. అలాగే మెంతి ఆకుల్లో ఉండే అమైనో ఆమ్లాలు ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకునేలా చూస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారు రోజూ మెంతి ఆకులను ఉడకబెట్టి తింటుంటే షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. టైప్ 1, 2 డయాబెటిస్ ఉన్నవారికి అందరికీ కూడా మెంతి ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. మెంతి ఆకుల్లో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది.
మెంతి ఆకుల్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో రక్తంలో ట్రై గ్లిజరైడ్ లెవల్స్ తగ్గుతాయి. మెంతి ఆకుల్లో ఉండే పొటాషఙయం బీపీని నియంత్రించేందుకు సహాయం చేస్తుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో రక్త నాళాల వాపులు తగ్గుతాయి. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. మెంతి ఆకుల్లో విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఈ ఆకులను తింటుంటే తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరిగి రోగాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
మహిళల ఆరోగ్యానికి కూడా మెంతి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆకులను తింటుంటే గర్భిణీల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. మహిళలు నెలసరి సమయంలో మెంతి ఆకులను తింటే తీవ్ర రక్త స్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెంతి ఆకుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది కనుక ఈ ఆకులను తింటుంటే రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఈ ఆకుల్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు రోజూ మెంతి ఆకులను తింటుంటే బరువును తగ్గించుకోవచ్చు. ఈ ఆకులు శరీర మెబటాలిజం పెరిగేలా చేస్తాయి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఇలా మెంతి ఆకులను తరచూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.