Cherry Tomatoes | టొమాటోలను మనం రోజూ వంటల్లో వేస్తూనే ఉంటాం. ఏ కూర అయినా సరే టొమాటోలు లేనిదే పూర్తి కాదు. టొమాటోలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే టొమాటోల్లోనూ అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో రామ ములక్కాయలు కూడా ఒకటి. ఇవి టొమాటోల మాదిరిగానే ఉంటాయి. కానీ పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. ఇవి కూడా టొమాటోల జాతికి చెందినవే. రామ ములక్కాయలు మనకు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా లభిస్తుంది. సూపర్ మార్కెట్లు లేదా రైతు బజార్లలోనూ కొన్ని చోట్ల ఈ కాయలను విక్రయిస్తుంటారు. అయితే టొమాటోలలాగే రామ ములక్కాయలు కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రామ ములక్కాయలను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ కాయల్లో లైకోపీన్ అధికంగా ఉంటుంది. అందువల్లే ఈ కాయలు ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్ చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. దీంతో క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ కాయల్లో ఉండే బీటా కెరోటీన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మార్పు చెందుతుంది. లుటీన్ అనే మరో యాంటీ ఆక్సిడెంట్ కూడా ఈ కాయల్లో అధికంగానే ఉంటుంది. విటమిన్ ఎ, లుటీన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. రామ ములక్కాయల్లో ఉండే నారింజైన్, నారింజెనిన్ అనే సమ్మేళనాలు యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. ఇవి కళ్ల వాపులను తగ్గిస్తాయి.
రామ ములక్కాయల్లో ఉండే లైకోపీన్‌ను అధిక మొత్తంలో పొందాలంటే ఈ కాయలను ఎల్లప్పుడూ ఉడకబెట్టి మాత్రమే తినాలి. పచ్చి వాటికన్నా ఉడకబెట్టిన కాయల్లోనే మనకు లైకోపీన్ అధిక మొత్తంలో లభిస్తుంది. లైకోపీన్ వల్ల గుండె కండరాల వాపులు రాకుండా అడ్డుకోవచ్చు. రక్త నాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నివారించవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ కాయల్లో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. రామ ములక్కాయల్లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ కొవ్వు మెటబాలిజంను పెంచుతుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు సైతం కరిగిపోతుంది. ఫలితంగా అధిక బరువు సులభంగా తగ్గుతారు.
రామ ములక్కాయల్లో ఉండే లైకోపీన్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుందని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా ప్రోస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. లైకోపీన్ వల్ల మహిళల్లో ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియో పోరోసిస్ రాకుండా అడ్డుకోవచ్చు. ఈ కాయల్లో ఉండే క్యాల్షియం, విటమిన్ కె ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు ఈ కాయలను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. చర్మం లేదా జుట్టు సమస్యలు ఉన్నవారు ఈ కాయలను మెత్తని పేస్ట్‌లా చేసి ఫేస్ ప్యాక్ లేదా హెయిర్ ప్యాక్‌లా కూడా ఉపయోగించవచ్చు. ఫేస్ ప్యాక్ చేసుకుంటే అందులో కాస్త తేనె కలపాలి. అదే జుట్టుకు వాడితే ఆ పేస్ట్‌లో కాస్త పెరుగు కలిపి వాడాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతాయి. ఇలా రామ ములక్కాయలతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.