Non Veg Foods | చికెన్, మటన్, చేపలు, ప్రాన్స్.. ఇలా ఏ మాంసాహార వంటకం అయినా సరే నాన్ వెజ్ ప్రియులకే పండగే. ఈ ఆహారాలను చాలా మంది మాంసాహార ప్రియులు ఇష్టంగా తింటుంటారు. అయితే నాన్ వెజ్ తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా దేన్నీ తీసుకోకూడదు అన్న సామెత చందంగా మాంసాన్ని కూడా అతిగా తినకూడదు. మాంసాన్ని అతిగా తింటే కిడ్నీలపై భారం పడుతుంది. దీంతో కిడ్నీలు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె పోటుకు కారణమవుతుంది. కనుక మాంసాన్ని మోతాదులోనే తినాలి. ఇక మాంసాహారం తినేవారు పలు ఇతర ఆహారాలను కూడా వాటితో కలిపి తినకూడదు. అలా తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుంది.
చాలా మంది మాంసాహారం తిన్న వెంటనే పండ్లను తింటుంటారు. అయితే మాంసాహారం తిన్న తరువాత పండ్లను తింటే సులభంగా జీర్ణం అవుతుంది కరెక్టే. కానీ కొన్ని రకాల పండ్లను మాత్రం మాంసం తిన్న వెంటనే తినకూడదు. సిట్రస్ ఫలాలతోపాటు నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ, తర్బూజా వంటి పండ్లను మాంసం తిన్న వెంటనే తినకూడదు. అలా తింటే మాంసాహారం సులభంగా జీర్ణం కాదు. ఇది అజీర్తిని కలగజేస్తుంది. దీంతో విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. పొట్టలో తీవ్రమైన అసౌకర్యం ఏర్పడుతుంది. ఈ పండ్లలో ఉండే ఆమ్లాలు, నీరు మాంసంతో కలిసి మాంసాన్ని త్వరగా జీర్ణం కాకుండా చేస్తాయి. అయితే మాంసాహారం తిన్న తరువాత కనీసం ఒక గంట వ్యవధి ఇచ్చి ఈ పండ్లను తినవచ్చు. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
కొందరు నాన్ వెజ్ తిన్న వెంటనే పాలు తాగుతారు. ఇలా తాగడం మంచిది కాదు. ఈ రెండు ఆహారాలు కలిస్తే పొట్టలో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది అసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలకు దారి తీస్తుంది. పొట్టలో వాయువులు పెరిగిపోతాయి. ఇవి గ్యాస్ సమస్యను కలగజేస్తాయి. అలాగే ఆహారం సులభంగా జీర్ణం కాదు. అజీర్తి ఏర్పడి పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. మాంసం తిన్న తరువాత పాలను తాగాలనుకుంటే కనీసం 2 గంటల వ్యవధి అయినా సరే ఉండాలి. అలాగే చేపలు లేదా ప్రాన్స్ వంటి సీఫుడ్‌ను తిన్న తరువాత పెరుగును తినకూడదు. ఇది కూడా పొట్టలో అసౌకర్యాన్ని కలగజేసి ఇబ్బందులు సృష్టిస్తుంది.
టమాటాలు, కోడిగుడ్లను కలిపి చాలా మంది తింటుంటారు. కానీ ఈ కాంబినేషన్ అసలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెండింటిలోనూ ఆమ్లాలు ఉంటాయి. కనుక ఈ రెండింటినీ కలిపి తింటే పొట్టలో ఆమ్లాలు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో అసిడిటీ సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి టమాటాలు, గుడ్లను కలిపి తినకూడదు. అలాగే కారం, మసాలాలను కూడా మాంసంతో మోతాదుగానే తినాలి. మరీ అతిగా కారం మసాలా వేసి మాంసాన్ని వండకూడదు. అలా వండి తింటే పొట్టలో ఇర్రిటేషన్ ఏర్పడుతుంది. విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కడుపులో మంట కూడా వస్తుంది. కాబట్టి నాన్ వెజ్‌తో ఈ ఫుడ్ కాంబినేషన్లు అసలు మంచివి కావు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.