మండే ఎండల్లో కేవలం నీళ్లు మాత్రమే తాగితే చాలదు. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ కూడా అందాలి. అందుకే.. ఇప్పుడు చాలామంది ‘లేజీ డ్రింక్’ వెంట పడుతున్నారు. సాధారణ నీటి కంటే 10 రెట్లు ఎక్కువ హైడ్రేషన్ అందించే ఈ డ్రింక్‌ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు: ఒక టేబుల్ స్పూన్ నీళ్లు/ కొబ్బరి నీళ్లు: ఒక గ్లాసు. నిమ్మరసం: ఒక టీస్పూన్ చక్కెర/ తేనె/ తాటి బెల్లం : రుచికి సరిపడా పుదీనా ఆకులు: నాలుగైదు
నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు నీటిలో వేయాలి. అందులో నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. చలవ కోసం పైన పుదీనా ఆకులు వేసి చల్ల చల్లగా తాగేయడమే!
వేసవి తాపానికి ‘సబ్జా గింజలు’ సమర్థంగా చెక్ పెడతాయి. వాటి బరువు కంటే 10-12 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. అందుకే.. సబ్జా గింజలతో చేసే డ్రింక్ శరీరానికి గంటల తరబడి హైడ్రేషన్ అందిస్తుంది. ఇక శరీరంలోని అంతర్గత వేడిని తగ్గించడంలోనూ ఇవి ముందుంటాయి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు కలపడం వల్ల సోడియం, పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ కూడా శరీరానికి అందుతాయి. ఎండ వల్ల వచ్చే అలసటను తగ్గిస్తాయి. అంతేకాదు, రెగ్యులర్‌గా వాడుకునే వాటర్ బాటిల్లో కొన్ని సబ్జా గింజలను వేసుకుంటే చాలు. ఆ రోజంతా ఎక్కడికి వెళ్లినా ఆ నీటిని తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండవచ్చు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్కవుట్స్ చేసిన తర్వాత ఈ నీటిని తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.