Dietary Tips For PCOS | పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీవోఎస్).. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పీసీవోఎస్ వచ్చిన మహిళల్లో రుతుక్రమం సరిగ్గా ఉండదు. శరీరంలో ఆండ్రోజన్ స్థాయిలు పెరిగిపోతాయి. సంతాన లోపం సమస్య ఏర్పడుతుంది. అధికంగా బరువు పెరుగుతారు. మొటిమలు ఏర్పడుతాయి. ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతున్న ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు పీసీవోఎస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య వచ్చిన వారు కచ్చితంగా డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే పీసీవోఎస్ను తగ్గించుకునేందుకు జీవన విధానం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రధానంగా తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
పీసీవోఎస్ ఉన్న మహిళలు శారీరక శ్రమ జరిగేలా చూసుకోవాలి. అలా లేకపోతే రోజుకు కనీసం 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ అయినా చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు గాను యోగా, ధ్యానం ఎంతగానో సహాయం చేస్తాయి. పచ్చని ప్రకృతిలో రోజూ కాసేపు గడపడం, పుస్తకాలు చదవడం, మనస్సుకు నచ్చిన సంగీతాన్ని వినడం వల్ల కూడా ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. అలాగే రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించాలి. పీసీవోఎస్ ఉన్న మహిళల్లో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. కనుక రోజుకు తప్పనిసరిగా 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. అలాగే డాక్టర్ సూచన మేరకు ఐనోసిటోల్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి సప్లిమెంట్లను వాడాలి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రాకుండా చూస్తాయి. అలాగే హార్మోన్లు సమతుల్యంలో ఉండేలా చేస్తాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) చెబుతున్న ప్రకారం పీసీవోఎస్ వచ్చిన మహిళలు అందరికీ కూడా ఒకేలాంటి మెడిసిన్లను వాడాల్సిన అవసరం ఉండదు. మహిళను బట్టి, ఆమె ఆరోగ్య పరిస్థితులను బట్టి భిన్న రకాల మందులను వాడాల్సి ఉంటుంది.
సరైన ఆహారం తీసుకుంటూ డైట్ పాటిస్తే షుగర్ లెవల్స్‌ను పెరగకుండా చూసుకోవచ్చు. శరీరంలో వాపులు కూడా తగ్గుతాయి. హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి. పీసీవోఎస్ ఉన్న మహిళల్లో ఇన్సులిన్ నిరోధకత సహజంగానే చాలా మందిలో అధికంగా ఉంటుంది. అందువల్ల ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు గాను షుగర్ తక్కువగా ఉండే ఆహారాలను, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినాలి. తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ ఉండే ఆహారాలను తినాలి. ఓట్స్, కినోవా, బ్రౌన్ రైస్‌ను తినాలి. రీఫైన్ చేయబడిన ఆహారాలను తినడం మానేయాలి. దీంతో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకోవచ్చు. అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ రాకుండా ఉంటుంది. పీసీవోఎస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్లు, తోఫు, పప్పు దినుసులను, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే అవకాడో, నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే పీసీవోఎస్ ఉన్న మహిళలకు మేలు జరుగుతుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తినడం మానేయాలి. ఖర్జూరాలను తినవచ్చు. పాలకూర, పియర్స్ పండ్లు, నారింజ వంటి వాటిని తింటుండాలి. పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఇలా ఆహారంలో పలు మార్పులు చేసుకుంటూ రోజూ వ్యాయామం చేస్తూ అన్ని జాగ్రత్తలను పాటించడంతోపాటు డాక్టర్లు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడుతుంటే పీసీవోఎస్ సమస్య నుంచి మహిళలు సులభంగా బయట పడతారు. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.