మార్కెట్లో ఏది ట్రెండీగా ఉంటే దాన్ని అనుసరించడంలో యువత ముందుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు డైట్ సోడా చాలామందికి సాధారణ అలవాటుగా మారింది. ఇది రోజుకు ఒకటి తీసుకుంటే, టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 38 శాతం పెరుగుతాయని తాజా పరిశోధన తెలిపింది. ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ, ఆర్ఎంఐటీ యూనివర్సిటీ, ది క్యాన్సర్ కౌన్సిల్ విక్టోరియాకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. 14 ఏళ్ల పాటు 36 వేల మంది ఆస్ట్రేలియన్లను పరిశీలించారు. చక్కెరతో తయారు చేసిన డ్రింక్స్, ఆర్టిఫిషియల్ సబ్స్టిట్యూట్స్ వాడిన పానీయాలు.. టైప్-2 డయాబెటిస్‌కు కారణమవుతాయని పరిశోధకులు తేల్చారు.
చాలామంది షుగరీ డ్రింక్స్‌కు ప్రత్యామ్నాయంగా డైట్ సోడా అంటూ మార్కెట్లోకి వచ్చిన ప్రతిదాన్నీ తాగుతుంటారు. అంతేకాదు, ఇది ఆరోగ్యానికి హాని చేయదనే భ్రమలో ఉంటున్నారు. కానీ, ఇప్పటికే మారిన జీవనశైలి వల్ల వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో డైట్ సోడాకు కూడా అలవాటుపడితే డయాబెటిస్ రిస్క్ మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.