Diabetes Symptoms | రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే ఆ స్థితిని డయాబెటిస్ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను ఉత్పత్తి అసలు చేయకపోతే అప్పుడు వచ్చే షుగర్‌ను టైప్ 1 డయాబెటిస్ అంటారు. అదే క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను తగినంత ఉత్పత్తి చేసినా శరీరం దాన్ని వినియోగించుకోకపోతే అలాంటి స్థితిని టైప్ 2 డయాబెటిస్ అంటారు. ఇక గర్భిణీలకు గర్భంతో ఉన్న సమయంలోనే వచ్చే డయాబెటిస్‌ను జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇలా డయాబెటిస్ అనేది పలు రకాలుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది అస్తవ్యస్తమైన జీవన విధానం కారణంగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. కానీ ఏ రకమైన డయాబెటిస్ వచ్చినప్పటికీ మన శరీరం దాదాపుగా ఒకేలాంటి లక్షణాలను తెలియజేస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే కిడ్నీలు ఆ షుగర్‌ను బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తుంటాయి. దీంతో మూత్ర విసర్జన ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. అయితే రాత్రిపూట కూడా మూత్ర విసర్జనకు మీరు ఎక్కువ సార్లు వెళ్తుంటే దాన్ని డయాబెటిస్‌గా అనుమానించాలి. రక్తంలో చక్కెర స్థాయిలు మరీ ఎక్కువగా ఉంటే రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఈ లక్షణం ఎవరిలో అయినా ఉంటే దాన్ని షుగర్‌గా అనుమానించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే రక్తంలో అధికంగా ఉండే చక్కెర స్థాయిల కారణంగా చాలా మందికి చెమట ఎక్కువగా వస్తుంది. చెమట బాగా పడుతుందంటే దాన్ని కూడా డయాబెటిస్‌గా అనుమానించాల్సిందే.
డయాబెటిస్ ఉంటే గొంతు త్వరగా ఎండిపోతుంది. శరీరంలోని నీరు త్వరగా బయటకుపోతుంది కనుక అలా జరుగుతుంది. గొంతు ఎండిపోయే సరికి దగ్గు కూడా వస్తుంది. గొంతు పొడిగా మారుతుంది. అలాగే కంటి చూపు కూడా స్పష్టంగా ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే కంటి చూపు మందగిస్తుంది. అంతకు ముందు అన్నీ స్పష్టంగా కనిపించినవి కూడా మసకగా కనిపిస్తుంటాయి. ఇలా ఎవరికైనా జరుగుతుంటే వారికి డయాబెటిస్ ఉందని అర్థం. వెంటనే స్పందించకపోతే డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ లక్షణాన్ని ఎవరూ అసలు నిర్లక్ష్యం చేయకూడదు.
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే శరీర కణాలు దాన్ని ఉపయోగించుకోలేకపోతే అప్పుడు కణాలకు ఆహారం లభించదు. ఫలితంగా ఆహారం తిన్నా కూడా ఇంకా ఆకలిగానే ఉంటుంది. ఈ లక్షణాన్ని కూడా డయాబెటిస్‌గానే అనుమానించాలి. షుగర్ కంట్రోల్లో లేకపోతే తిన్న వెంటనే మళ్లీ తినాలనిపిస్తుంది. ఆకలి అవుతుంది. అలాగే రక్తంలో అధికంగా ఉండే షుగర్ లెవల్స్ కారణంగా రక్త సరఫరాకు సైతం ఆటంకం ఏర్పడుతుంది. దీంతో కాళ్లు, చేతులకు రక్తం సరిగ్గా సరఫరా అవదు. ఫలితంగా ఆయా భాగాల్లో సూదులతో గుచ్చినట్లుగా ఉంటుంది. కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ ఉన్నట్లు తేలితే వెంటనే మందులను వాడాలి. దీంతో శరీరంలోని ఇతర అవయవాలపై భారం పడకుండా కాపాడుకోవచ్చు.