Exercise | అధిక రక్త చక్కెర స్థాయిలు, అంటే Hyperglycemia, ఆరోగ్యానికి అనుకున్నదానికంటే ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. దీన్ని నియంత్రించకుండా వదిలేస్తే తక్షణ సమస్యలతో పాటు దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కూడా ఎదురవుతాయి. సాధారణంగా డయాబెటిస్ తో సంబంధం ఉన్న ఈ పరిస్థితి వల్ల ఎక్కువ దాహం, తరచుగా మూత్ర విసర్జన, అలసట, చూపు మసకబారడం, తలనొప్పి, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలంగా రక్తంలో చక్కెర అధికంగా ఉంటే అది శరీరంలోని రక్తనాళాలు, నరాలను క్రమంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా కిడ్నీ సమస్యలు, నరాల నష్టం, చూపు కోల్పోవడం, పాద సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీటితో పాటు రక్త చక్కెర స్థాయిలు వ్యాయామ పనితీరుపై కూడా ప్రభావం చూపుతాయి. వ్యాయామ సమయంలో అధిక చక్కెర స్థాయిలు శారీరకంగా, మానసికంగా పనితీరును తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
అధిక రక్త చక్కెర ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన శక్తి అందకుండా అలసట, నిస్సత్తువ పెరుగుతుంది. రక్తంలో ఉన్న చక్కెర శక్తిగా ఉపయోగపడకపోవడం వల్ల వ్యాయామం చేయడానికి ఇబ్బంది కలుగుతుంది. దీంతో శారీరక సామర్థ్యం తగ్గిపోతుంది. ఇంకా గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇది కండరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. నీరసం ఉన్న కండరాలు సరిగా స్పందించకపోవడం వల్ల శక్తి, సమన్వయం తగ్గిపోతాయి. అధిక రక్త చక్కెర మెటబాలిజం ప్రక్రియలను కూడా దెబ్బతీస్తుంది. దీంతో కార్బోహైడ్రేట్స్‌ను శక్తిగా మార్చే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది వ్యాయామ సమయంలో శరీరానికి అవసరమైన శక్తి సరఫరాను తగ్గిస్తుంది. వ్యాయామం తర్వాత శరీరం త్వరగా కోలుకోవడం కూడా కష్టమవుతుంది. కండరాల నొప్పులు ఎక్కువ కాలం కొనసాగడం, ఇన్ఫ్లమేషన్ పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది ఫిట్నెస్ పురోగతిని మందగింపజేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు మానసిక లక్షణాలు కూడా కనిపిస్తాయి. చూపు మసకబారడం, ఏకాగ్రత లోపించడం, వేగంగా కదిలే విషయాలను గుర్తించడంలో ఇబ్బంది పడటం వంటి సమస్యలు వస్తాయి. కొంతమందిలో కడుపు నొప్పి, వికారం, చిరాకు కూడా కనిపించవచ్చు.
రక్త చక్కెర స్థాయి 250-270 mg/dL కంటే ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అధిక తీవ్రత గల వ్యాయామాలు చేయకూడదు. స్ప్రింటింగ్, హెవీ వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు అడ్రినలిన్ వంటి హార్మోన్లను పెంచి రక్త చక్కెరను మరింత పెంచే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు లేదా అధిక రక్త చక్కెరకు గురయ్యే వారు వ్యాయామం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం ముందు, మధ్యలో, తర్వాత రక్త చక్కెర స్థాయిలను పరిశీలించడం ద్వారా శరీర ప్రతిస్పందనను అర్థం చేసుకోవచ్చు. అలాగే తగినంత నీరు తాగడం చాలా అవసరం. వ్యాయామానికి ముందు, మధ్యలో, తర్వాత హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల రక్త చక్కెర నియంత్రణలో ఉంటుంది. అలాగే రోజులో రక్త చక్కెర తక్కువగా ఉండే సమయాన్ని ఎంచుకుని వ్యాయామం చేయడం మంచిది.
కొత్తగా వ్యాయామం ప్రారంభిస్తున్నవారు లేదా అధిక రక్త చక్కెర ఉన్నవారు నెమ్మదిగా ప్రారంభించాలి. నడక, లైట్ స్ట్రెచింగ్ వంటి తక్కువ తీవ్రత గల వ్యాయామాలతో మొదలుపెట్టి క్రమంగా పెంచాలి. ఏరోబిక్ వ్యాయామాలతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేయడం మంచిది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి రక్త చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వ్యాయామానికి ముందు సరైన స్నాక్ తీసుకోవడం కూడా చాలా అవసరం. వీటితో పాటు ముఖ్యంగా శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలి. వ్యాయామ సమయంలో తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపి వైద్య సలహా తీసుకోవాలి. సరైన ఆహారం, నీరు, నిద్రతో పాటు రక్త చక్కెర నియంత్రణ కూడా ఫిట్‌నెస్‌లో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.