హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘లొంగకపోతే నిన్నూ, నీ భర్త, పిల్లలను చంపేస్తా’ అంటూ బీజేవైఎం జాతీయ మాజీ కోశాధికారి సాయిప్రసాద్ తనను పలుమార్లు వేధింపులకు పాల్పడ్డాడని బీజేపీ మహిళా నేత, రాష్ట్ర ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ అల్వాల్ పోలీసులను ఆశ్రయించారు. లైంగికంగా వేధిస్తూ, కులం పేరుతో దూషిస్తూ, తరచూ బెదిరిస్తూ, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తామని హెచ్చరించారని సాయిప్రసాద్ అలియాస్ ‘టీమ్ సాయి’తోపాటు పాక శివ, రాహుల్, జాన్, ఆదిత్యపై బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడానికి మీనమేషాలు లెక్కించిన పోలీసులు.. బాధితురాలి ఒత్తిడి మేరకు బుధవారం కేసు నమోదు చేశారు.
ఈ కేసులో బీఎన్ఎస్, ఐటీ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు. బీజేపీ నేత సాయిప్రసాద్ లైంగిక వేధింపుల వ్యవహారంతో బీజేపీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతున్నది. బాధితురాలి కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్‌గా పనిచేసిన ఆ మహిళ.. గతంలో సాయిప్రసాద్, అతని బృందంతో కలిసి పనిచేశారు. 2026 ఏప్రిల్ 1నుంచి ఆయన బృందంతో పనిచేయడం మానేసినట్టు ఫిర్యాదులో పేరొన్నారు. దీంతో సాయిప్రసాద్ తనను పలుమార్లు బెదిరిస్తూ, వేధిస్తూ, తనతో లైంగిక సంబంధాలు కొనసాగించాలని ఒత్తిడి చేసినట్టు బాధితురాలు ఆరోపించారు. లేకుంటే తనతోపాటు భర్త, పిల్లలకు హాని చేస్తామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేరొన్నారు.
సాయిప్రసాద్‌తో నా కుటుంబానికి ప్రాణహాని
సాయిప్రసాద్ తనను లైంగికంగా వేధించడమే కాకుండా తన అనుచరులతో కలిఇ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురిచేశాడని బాధితురాలు అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతను తన అనుచరులతో కలిసి భయపెట్టడం, కులం పేరుతో దూషించడం, అవమానించడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడని పేర్కొన్నది. సాయిప్రసాద్‌తోపాటు అతని అనుచరులతో తనకు, తన భర్త, పిల్లలకు ప్రాణహాని ఉన్నదని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. సాయిప్రసాద్.. పాక శివ, రాహుల్, ఆదిత్య, జాన్‌తో కలిసి తనను వేధింపులకు గురిచేసినట్టు పేర్కొన్నారు.
తనకు ఇష్టం లేదని చెప్పినా పదేపదే అర్ధరాత్రి వేళల్లో ఫోన్లు చేస్తూ, తన నివాసానికి వచ్చి, నకిలీ అసభ్యకర ఎలక్ట్రానిక్ కంటెంట్ సృష్టిస్తామని బెదిరింపులకు గురిచేశారని తెలిపింది. జాతీయ స్థాయిలో సాయికి పలుకుబడి, రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉండటంతో తాను అతడు ఎన్ని అరాచకాలకు పాల్పడినా చాలాకాలం మౌనంగా ఉన్నానని, అతడికి వ్యతిరేకంగా వెళ్తే తన రాజకీయ భవిష్యత్తు, కుటుంబానికి హాని తలపెడుతాడేమోనని తాను భయపడి ఇన్ని రోజులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేకపోయానని ఆ మహిళ పేర్కొన్నారు. పోలీసులు వత్తిళ్లకు గురికాకుండా సమగ్ర దర్యాప్తు జరిపి సాయిప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బెడ్రూమ్లోకి రమ్మంటూ ఒత్తిళ్లు
2020 జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం తన భర్త, తనకు సాయిప్రసాద్ అలియాస్ టీమ్ సాయితో పరిచయం ఏర్పడిందని, రాజకీయంగా 2026 ఏప్రిల్ 1 వరకు సాయి బృందంతో కలిసి సుమారు ఆరేండ్లపాటు పనిచేసినట్టు బాధితురాలు తెలిపారు. 2024 డిసెంబర్ 24న ఉదయం సుమారు 11:05 నుంచి 11:35 గంటల సమయంలో సాయిప్రసాద్ నివాసంలో ఉన్నప్పుడు తనను బెదిరించి, తన బెడ్రూమ్లోకి రావాలని పదేపదే ఒత్తిడి చేశాడని, అందుకు నిరాకరించడంతో తన భర్త, కుటుంబసభ్యులను చంపుతానంటూ బెదిరింపులకు గురిచేశాడని ఆరోపించారు. దీంతో తాను భయపడిపోయి అకడి నుంచి తన ఇంటికి తిరిగి వచ్చానని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. 2025లో కూడా మరోసారి సాయిప్రసాద్ తనపై మళ్లీ అదే విధంగా ప్రవర్తించి తన బెడ్రూమ్ లోకి రావాలని ఒత్తిడి చేసి, బెదిరింపులకు గురిచేసినట్టు ఫిర్యాదులో తెలిపారు.
బీజేపీ కార్యాలయంలోనూ వేధింపులు
2026 ఏప్రిల్ 1న నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావాలని సాయిప్రసాద్ తనకు ఫోన్ చేశారని, తన భర్తతో కలిసి అకడికి తాను వెళ్లినట్టు బాధితురాలు తెలిపారు. అకడ సాయిప్రసాద్, పాక శివ, రాహుల్, జాన్, ఆదిత్య తనను కులంపేరుతో దూషించి అవమానించారని ఆరోపించారు. తన ఫొటోలను చిన్న సైజులో ప్రచురించడంపై సాయిప్రసాద్ అభ్యంతరం వ్యక్తంచేస్తూ అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదులో పేరొన్నారు. తన రాజకీయ భవిష్యత్తును, ప్రతిష్ఠను దెబ్బతీస్తామని అక్కడే బెదిరించినట్టు ఆరోపించారు. తనపై ఏఐతో రూపొందించిన అసభ్యకర ఫొటోలు, వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తామని బెదిరించినట్టు బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు. ‘నా మద్దతు లేకుండా రాజకీయాల్లో ఎదగలేవు, నీకు ఆర్థిక బలం లేదు, భవిష్యత్తులో కార్పొరేటర్ లేదా ఇతర రాజకీయ పదవి పొందాలంటే నాశక్తి, డబ్బు అవసరం, దళితులకు గుర్తిం పు ఉండదు. నామద్దతు లేకుండా బీజేపీలో ముం దుకు వెళ్లలేవు’ అంటూ సాయిప్రసాద్ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అర్ధరాత్రి ఇంటికి వచ్చి బెదిరింపులు
2026 ఆగస్టు 21రాత్రి సుమారు 11 గంటల నుంచి 11.30 గంటల సమయంలో జాన్, పాక శివ, రాహుల్ తన ఇంటికి వచ్చి సాయిప్రసాద్‌తో మాట్లాడాలని ఒత్తిడి చేసినట్టు పద్మిని ఆరోపించారు. తనను కులం పేరుతో దూషించి, సాయిప్రసాద్ తనను, తన భర్తను వదిలిపెట్టడని, తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తామని వారు బెదిరించారని ఆమె పేరొన్నారు. తనకు, తన పిల్లలకు, కుటుంబానికి భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరించారని తెలిపారు. వరుసగా అర్ధరాత్రి ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ భయాందోళనకు గురిచేసినట్టు పేరొన్నారు.
సాయిప్రసాద్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు
అల్వాల్, అక్టోబర్ 7: బీజేపీ మహిళా నాయకురాలిని లైంగికంగా వేధించాడనే ఫిర్యాదుతో అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో బీజేపీ నేత సాయిప్రసాద్‌తోపాటు మరో నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై అల్వాల్ పోలీసులు క్రైం నంబర్ 989/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీఎన్ఎస్లోని 75, 78, 79, 352, 351(3), 61 రెడ్ విత్ 3(5) సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 66(సీ), 66(ఈ), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని 3(1)(r), 3(1)(s), 3(1)(w)(ii) సెక్షన్లను నమోదు చేశారు.
ఎవరీ టీమ్ సాయి?
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): బీజేపీ నేత టీమ్ సాయిపై ఆ పార్టీ మహిళా నేత ఫిర్యాదుతో రాజకీయ దుమారం చెలరేగుతున్నది. సాధారణ ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తగా పనిచేసి, కేంద్రస్థాయిలోని పార్టీ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించిన పీఎం సాయి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్‌లోని గంగపుత్ర కాలనీకి చెందిన ఈ పీఎంసాయి.. రాజకీయాలు, వ్యాపారాల కంటే ముందు స్థానికంగా ఆర్టీఐ కార్యకర్తగా చెలామణి అయినట్టుగా తెలిసింది. అక్కడి నుంచి మొదలైన అతని రాజకీయపర్వం.. అక్రమాలు, బెదిరింపులు, గల్లీ రౌడీగా మారిపోయాడు. 2007 ఎన్ఎస్యూఐలో కొద్దిరోజుల పాటు పనిచేసిన అతను.. ఆ తర్వాత బీజేవైఎంలో చేరాడు. కొన్నాళ్లకు బీజేవైఎం జాతీయ కోశాధికారిగా ఎదిగాడు. ఆ అవకాశంతో బీజేపీ కీలక వ్యవహారాల్లోనూ పనిచేశాడు.
మైనంపల్లి కుటుంబంతో రాజకీయ వైరం
టీమ్ సాయి ఓ వైపు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండసాగాడు. మరోవైపు స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి కుటుంబంతో అతనికి రాజకీయ వైరం ఏర్పడింది. ఓ వివాదం విషయంలో ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వైరం నెలకొన్నది. కానీ, ఢిల్లీ స్థాయిలో టీమ్ సాయికి ఉన్న ఫాలోయింగ్, ప్రాధాన్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తన పెండ్లి వేడుకకు సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇంకా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాష్ర్టాల బీజేపీ, బీజేవైఎం నేతలు కూడా ఆ పెండ్లి వేడుకల్లో హాజరైన వీడియోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.