రక్షాబంధన్ వాణిజ్య ప్రకటనలో కథానాయిక కృతిసనన్ ధరించిన దుస్తులపై సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సంప్రదాయ వేడుకలో అలాంటి దుస్తులు ధరించడమేంటని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై కృతిసనన్ మరోమారు స్పందించింది. కరీనా కపూర్ నిర్వహిస్తున్న ‘వాట్ విమెన్ వాంట్’ సీజన్ 6లో పాల్గొన్న ఆమె ఈ వివాదంపై మాట్లాడింది. ‘నేను ధరించిన డ్రెస్ ఇంత వివాదం సృష్టిస్తుందని అనుకోలేదు. ఏకంగా ఆరుగురు కూర్చుని చేసే ప్రైమ్‌టైమ్ న్యూస్ ప్యానెల్ డిబేట్‌గా మారింది.
ఇతరుల్ని జడ్ట్ చేస్తూ తీర్పులు ఇవ్వడం చాలా సులభం. ఇక్కడ అందరూ తీర్పులిచ్చేవారే. ఎవరి పని వారు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అంటూ కృతిసనన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. రక్షాబంధన్ ప్రకటనలో కృతిసనన్ ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించింది. తన సోదరుడితో పాటు శునకానికి రాఖీ కట్టినట్లుగా ఆ ప్రకటనలో చూపించారు. ఈ వివాదం నేపథ్యంలో చివరకు మేకర్స్ ఆ యాడ్‌ను తొలగించారు.