భూ తాపం, ఎవరి పాపం?
భూగోళం వేడెక్కుతున్నది. వాతావరణం తన సహజ సమతుల్యతను కోల్పోతున్నది. ఈ నేపథ్యంలో ఎల్ నినో ప్రభావం మరింత ఆందోళన కలిగిస్తున్నది. 2026 ద్వితీయార్థంలో ఉగ్రరూపం దాల్చిన ఎల్ నినో పరిస్థితులు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కరువు, తీవ్రమైన వేడి, అగ్నిప్రమాదాలు, అసాధారణ వర్షపాత ముప్పులను పెంచే అవకాశమున్నదని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
భూగోళం వేడెక్కుతున్నది. వాతావరణం తన సహజ సమతుల్యతను కోల్పోతున్నది. ఈ నేపథ్యంలో ఎల్ నినో ప్రభావం మరింత ఆందోళన కలిగిస్తున్నది. 2026 ద్వితీయార్థంలో ఉగ్రరూపం దాల్చిన ఎల్ నినో పరిస్థితులు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కరువు, తీవ్రమైన వేడి, అగ్నిప్రమాదాలు, అసాధారణ వర్షపాత ముప్పులను పెంచే అవకాశమున్నదని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ సంక్షోభానికి మూలకారణాల్లో శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, పారిశ్రామిక కాలుష్యం, అడవుల విధ్వంసం, పెచ్చరిల్లుతున్న వినిమయ సంస్కృతి ప్రధానమైనవి. ప్రపంచ వాతావరణ సంస్థ తాజా నివేదికల ప్రకారం, 2025లో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ సాంద్రత పారిశ్రామిక విప్లవానికి పూర్వపు స్థాయితో పోలిస్తే 153 శాతానికి చేరింది. 2026లో ఎల్ నినో ప్రభావంతో భూమి, సముద్రాలు గ్రహించే కార్బన్ పరిమాణం తగ్గే పరిస్థితులు ఏర్పడితే వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుదల మరింత వేగవంతమయ్యే ప్రమాదం ఉన్నది.
ఇది భవిష్యత్తు తరాల మనుగడకే సవాల్‌గా మారుతున్నది. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన ప్రశ్న ఏమిటంటే..ఈ సంక్షోభానికి ఎవరు ఎక్కువ బాధ్యులు? దాని పరిణామాలను ఎవరు ఎక్కువగా అనుభవిస్తున్నారు? పారిశ్రామిక విప్లవం రోజుల నుంచి దశాబ్దాల తరబడి బొగ్గు, చమురు వినియోగంతో సంపదను పోగేసుకున్న అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచ వాతావరణంలో గణనీయమైన ఉద్గారాలను పోగుచేశాయి. కానీ సదరు అభివృద్ధి వల్ల వాతావరణంపై పడిన భారాన్ని ప్రపంచమంతా సమానంగా మోయాల్సి వస్తున్నది. తక్కువ కార్బన్ ఉద్గారాలకు కారణమైన పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం కరువులు, వరదలు, వ్యవసాయ నష్టాలు, సముద్ర మట్టాల పెరుగుదల వంటి విపత్తులకు ఎక్కువగా గురవుతున్నాయి.
వాతావరణ మార్పులపై అంతర్జాతీయ చర్చల్లో ‘ఉమ్మడి బాధ్యతలు.. భిన్నమైన సామర్థ్యాలు’ అనే సూత్రానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. వాతావరణ మార్పులను అరికట్టడం ప్రపంచ దేశాలన్నింటి బాధ్యతే అయినప్పటికీ, చారిత్రక ఉద్గారాలు, ఆర్థిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అభివృద్ధి చెందిన దేశాలు మరింత ఎక్కువ బాధ్యత వహించాలి. ఈ బాధ్యతను గుర్తుచేసే కీలక వేదికగా ఈ నెల 9 నుంచి 20 వరకు టర్కియేలోని అంటాల్యాలో జరుగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు కాప్ 31 నిలువాలి. ప్రపంచ దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొనే ఈ సదస్సు ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.
గత మూడు దశాబ్దాలుగా దాదాపు ప్రతి సంవత్సరం వాతావరణ సదస్సులు జరుగుతున్నాయి. పారిస్ ఒప్పందం వంటి చారిత్రక ఒప్పందాలు కుదిరాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను పరిమితం చేస్తామని, కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తామని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాయం అందిస్తామని సంపన్న దేశాలు హామీలు గుప్పించాయి. సదస్సుల్లో చేసే ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో తీసుకునే చర్యలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడమే కాప్ 31 ముందున్న అసలైన పరీక్ష. సంపన్న దేశాలు తమ కార్బన్ పాదముద్రను తగ్గించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యాచరణను ప్రకటించాలి. కాలుష్యకారక పరిశ్రమలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు తరలించి, తమ దేశాల ఉద్గారాల గణాంకాలను మాత్రమే తగ్గించుకున్నట్టు చూపించే ద్వంద్వవిధానాలకు అవి స్వస్తి చెప్పాలి.
అంతేకాకుండా వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొంటున్న దేశాలకు ఆర్థిక సాయం అందించడం అనేది చారిత్రక బాధ్యతకు సంబంధించిన అంశం. అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం 2035 నాటికి సంవత్సరానికి కనీసం 300 బిలియన్ డాలర్ల వాతావరణ నిధులను సమీకరించాలని 2024 నాటి కాప్ 29లో కొత్త లక్ష్యాన్ని అంగీకరించారు. అయితే ఇందులో సంపన్న దేశాల వాటా ఎంత? టర్కియేలో జరుగనున్న కాప్ 31 మరో అంతర్జాతీయ సమావేశంగా మిగిలిపోకూడదు. సంపన్న దేశాలు తమ చారిత్రక బాధ్యతను అంగీకరించి, కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకునేలా చేయాల్సిన అవసరం ఉన్నది. భూగోళాన్ని కాపాడాలంటే హామీలతో కాదు.. బాధ్యతాయుతమైన చర్యలతోనే ముందుకు సాగాలి.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ తాపం, ఎవరి పాపం?
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

