బ్యూనస్ఎయిర్స్ : సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ అర్జెంటీనా జట్టుకు ఘనంగా వీడ్కోలు పలికాడు. తన దేశం తరఫున చివరి మ్యాచ్ ఆడి అంతర్జాతీయ కెరీర్‌ను ముగించాడు. సుమారు 85వేల మంది ప్రేక్షకుల నడుమ ప్రఖ్యాత ఎస్టాడియో మాస్ మాన్యుమెంటల్ స్డేడియంలో బెనిన్‌తో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో దేశానికి చివరి గోల్ కొట్టిన మెస్సీ 3-0తో అర్జెంటీనాను గెలిపించాడు. 2022లో ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన అర్జెంటీనా జట్టు ఆటగాళ్లు, వారి కుటుంబాలతో పాటు అశేష ప్రేక్షకుల నడుమ భావోద్వేగంగా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన మెస్సీ.. చెమ్మగిల్లిన కళ్లతో అందరికీ అభివాదం చేస్తూ తన చివరి ఆటను ఆడేశాడు.
గేమ్ ద్వితియార్థంలో 71వ నిమిషంలో లభించిన పెనాల్టీని రైట్ కార్నర్ నుంచి గోల్ కొట్టిన మెస్సీ.. నికోలస్, నికో పజ్ కొట్టిన గోల్స్‌కు అసిస్ట్ అందించాడు. మెస్సీ ఆఖరాటకు గుర్తుగా ఆట పదో నిమిషంలో మ్యాచ్‌ను కాసేపు నిలిపేశారు. అంతర్జాతీయ కెరీర్లో 207 మ్యాచుల్లో 126 గోల్స్, 66 అసిస్టులతో అర్జెంటీనా జెర్సీకి వీడ్కోలు పలికిన మెస్సీ ఇకపై క్లబ్ సాకర్ మాత్రమే ఆడనున్నాడు.