Diabetes | మా బాబు వయసు పదమూడు. ఎందుకో ఈ మధ్యకాలంలో ఎన్నిసార్లు తిన్నా.. ఆకలి, ఆకలి అంటూ ఉంటాడు. ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. ఇదేమైనా మధుమేహ లక్షణమా? మిగతా విషయాల్లో మాత్రం తను చురుగ్గానే ఉంటాడు. పిల్లలలో డయాబెటిస్ పెరుగుతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. మా బంధువుల అబ్బాయికి ఇలాంటి సమస్యే ఉంది. మీరే తగిన పరిష్కారం చెప్పాలి.
– ఓ పాఠకురాలు
మీరు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే.. ఇది మధుమేహంలా అనిపించడం లేదు. కౌమారంలో ప్రవేశించగానే పిల్లల పెరుగుదల వేగవంతం అవుతుంది. దీనివల్ల పోషకాలు ఎక్కువగా అవసరం అవుతాయి. దీంతో ఎదిగే పిల్లలు సహజంగానే ఎక్కువ ఆహారం తీసుకుంటారు. మీ బాబు విషయంలో కూడా ఇదే జరుగుతున్నది. డయాబెటిస్‌కు సంబంధించి.. బరువు తగ్గడం, నీరసంగా ఉండటం, తరచూ మూత్రానికి వెళ్లడం, బట్ట తడపడం మొదలైన లక్షణాలు తనలో లేవు కాబట్టి, ఇది ఎదుగుదలకు సంబంధించిన ఆకలి మాత్రమే అని అర్థం అవుతున్నది. ఎందుకైనా మంచిది ఒకసారి పిల్లల డాక్టర్‌కు చూపించండి.
బాబు ఎదుగుదల సరిగా ఉంటే.. ఏ పరీక్షలూ అవసరం లేదు. నిజమే, పిల్లలలో మధుమేహం పెరుగుతున్నది. అందులోనూ, పిల్లలలో వచ్చేది.. టైప్ వన్ డయాబెటిస్. ఈ సమస్య ఉంటే మాత్రలు సరిపోవు. ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. తగిన చికిత్స తీసుకుంటే మిగతా పిల్లల్లా జీవనం సాగించవచ్చు. దాదాపుగా సహజమైన జీవితాన్ని గడపవచ్చు. ఇక టైప్-2 డయాబెటిస్ పెద్దలకు వస్తుంది. మధుమేహానికి జీవనశైలి, ఊబకాయం ప్రధాన కారణాలు. ఈ దశాబ్దకాలంలో ఈ రుగ్మత పిల్లలనూ ఇబ్బంది పెడుతున్నది. అలా అని భయపడాల్సిన పన్లేదు. సకాలంలో పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్లకు చూపిస్తే.. రుగ్మత తీవ్రత తగ్గించవచ్చు.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్