వాషింగ్టన్ : కరోనా వైరస్ ఒరిజినల్ స్ట్రెయిన్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ నాసికా రంధ్రాల్లో వైరస్ వేయిరెట్లు అధికంగా ఉంటుందని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) స్పష్టం చేసింది. డెల్టా అత్యంత ఇన్ఫెక్షన్ కారక శ్వాసకోశ వ్యాధిగా శాస్త్రవేత్తలు గుర్తించారని సీడీఎస్ డైరెక్టర్ డాక్టర్ రోషెల్లి వాలెన్స్కీ పేర్కొన్నారు. డెల్టా వ్యాప్తి కూడా వేగవంతంగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. తన 20 ఏండ్ల కెరీర్లో ఇంతటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్కు దారితీసే వేరియంట్ డెల్టానేనని ఆయన తెలిపారు.
అమెరికాలో వెలుగుచూస్తున్న కేసుల్లో 83 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వే కావడంతో సీడీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డెల్టా వ్యాప్తితో గత వారంలో సగటు కేసులు ఏకంగా 53 శాతం ఎగబాకడంతో నూతన వేరియంట్ వ్యాప్తి అమెరికాలో ఆందోళన రేకెత్తిస్తోంది. రోగులు ఆస్పత్రుల్లో చేరడం 32 శాతం, మరణాలు 19 శాతం పెరిగాయి. వ్యాక్సినేషన్ మందకొడిగా జరిగిన ప్రాంతాల్లో వైరస్ విజృంభణ అధికంగా ఉందని, దీనిపై దేశమంతా ఒక్కటిగా పోరాడాల్సిన అవసరం ఉందని సీడీసీ డైరెక్టర్ వాలెన్స్కీ పిలుపు ఇచ్చారు.