Dark Circles | డిజిటల్ వస్తువుల వినియోగం కారణంగా మనలో చాలా మంది కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ అందాన్ని ఈ డార్క్ సర్కిల్స్ ఎంతగానో దెబ్బతీస్తాయని చెప్పవచ్చు. కేవలం డిజిటల్ వస్తువుల వినియోగం ద్వారా మాత్రమే కాకుండా నిద్రలేమి, వయసు పైబడడం, చర్మం కొల్లాజెన్ ఉత్పత్తిని కోల్పోవడం, చర్మంలో మెలనిన్ తక్కువగా ఉండడం, జన్యుపరమైన కారణాల వల్ల కూడా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. ఈ నల్లటి వలయాలను తొలగించుకోవడానికి అనేక రకాల క్రీములు, సీరమ్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఖరీదైన నూనెలను వాడుతూ ఉంటారు. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా సహజ సిద్దమైన ఇంటి చిట్కాలను ఉపయోగించి కళ్ల చుట్టూ వచ్చే ఈ నల్లటి వలయాలను తొలగించుకోవచ్చు.
కళ్ల చుట్టూ వచ్చే నల్లటి వలయాలను తొలగించడంలో కీరదోస ఎంతగానో సహాయపడుతుంది. దీని కోసం కీరదోస ముక్కలను మందంగా కట్ చేసి కళ్లపై అరగంట పాటు ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కళ్లని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి భాగంలో చర్మానికి రక్తప్రసరణ పెరుగుతుంది. కళ్లకు అలసట తగ్గి విశ్రాంతి లభిస్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే రోజ్ వాటర్ మన చర్మానికి టోనర్ గా పని చేస్తుందని చెప్పవచ్చు. దీనిని వాడడం వల్ల చర్మ కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కళ్ల చుట్టూ నల్లటి వలయాలతో బాధపడే వారు దూదిని లేదా కాటన్ ప్యాడ్ ను తీసుకుని రోజ్ వాటర్ లో ముంచి కళ్లపై సున్నితంగా రాయాలి. దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు తగ్గుతాయి. కళ్లకు ఉపశమనం కలుగుతుంది.
గ్రీన్ టీ బ్యాగులను నీటిలో ముంచి ఆ తరువాత 30 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఈ బ్యాగులు చల్లగా అయిన తరువాత కళ్లపై 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు తగ్గుతాయి. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కళ్ల చుట్టూ బిగుసుకుపోయిన రక్తనాళాలను సరిచేసి కళ్లకు రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేయడంలో సహాయపడతాయి. అలాగే పాలల్లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఉన్నవారు చల్లని పాలల్లో కాటన్ ప్యాడ్ ను ముంచి కళ్లపై రాసుకుని 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు త్వరగా తగ్గుతాయి.
పసుపులో విటమిన్ ఇ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను కళ్ల చుట్టూ రాసి 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. పసుపులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. పసుపు బ్లీచింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కనుక కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగించడంలో పసుపు చక్కగా పనిచేస్తుంది. అలాగే నారింజ రసంలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. కళ్ల చుట్టూ నల్లటి వలయాలను తొలగించడంలో ఇవి చక్కగా పనిచేస్తాయి. ఒక గిన్నెలో కొద్దిగా నారింజ రసాన్ని తీసుకుని అందులో కొన్నిచుక్కల గ్లిజరిన్ ను వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కళ్లపై రాసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయి.
కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడంలో ఆలుగడ్డలు కూడా మనకు ఎంతో సహాయపడతాయి. గంట పాటు ఆలుగడ్డను ఫ్రిజ్ లో ఉంచి ఆ తరువాత మందపాటి ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలను 20 నిమిషాల పాటు కళ్లపై ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆలుగడ్డల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడతాయి.