Dandruff Home Remedies | చుండ్రు సమస్యను దాదాపుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటూనే ఉంటారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. గాలి కాలుష్యం లేదా కాలుష్య భరితమైన నీటితో తలస్నానం చేయడం, షాంపూలను అతిగా వాడడం, ఒత్తిడి, ఆందోళన, థైరాయిడ్ సమస్యలు, మెడిసిన్లను వాడడం వంటి అనేక కారణాల వల్ల చుండ్రు వస్తుంది. అయితే చుండ్రు సమస్యను వదిలించుకోవాలంటే అందుకు బ్యూటీ పార్లర్లకు వెళ్లి ఖరీదైన ట్రీట్మెంట్ను తీసుకోవాల్సిన పనిలేదు. ఇంట్లోనే పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలు, దాంతో చుండ్రు వదిలిపోతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని తులసి ఆకులను తీసుకుని అందులో 2 టీస్పూన్ల ఉసిరికాయ పొడి కలిపి కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేయాలి. ఈ పేస్టును తలకు పట్టించాలి. మాడుకు పట్టేలా మర్దనా చేయాలి. అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య పోవడమే కాదు జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
పెరుగు అందరికీ అందుబాటులో ఉండే పదార్ధం. దీంతో అందానికి మెరుగు దిద్దుకోవచ్చు. ఒక కప్పు పుల్లటి పెరుగును జుట్టు అంతటికీ బాగా పట్టించి గంట తరువాత షాంపూతో కడిగేయాలి. వారంలో 2 సార్లు ఇలా చేస్తే చుండ్రు క్రమంగా తగ్గుతుంది.
కొబ్బరినూనె జుట్టుకు పోషణనిస్తే, నిమ్మరసం చుండ్రును తగ్గిస్తుంది. పావు కప్పు చొప్పున కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత షాంపూతో కడిగేయాలి.
గ్రీన్ టీలో యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించి మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక కప్పు వేడి నీటిలో 2 గ్రీన్ టీ బ్యాగులను 20 నిమిషాల పాటు వేయాలి. చల్లారిన తరువాత ఈ నీటిని మాడుపై పోసి మర్దనా చేయాలి. 30 నిమిషాలు ఆఇ చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే చుండ్రు తగ్గి జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు ప్రకాశవంతంగా మారుతుంది.
అర కప్పు పెరుగులో రెండు పెద్ద టీస్పూన్ల నిమ్మరసం, 1 పెద్ద టీస్పూన్ తేనె కలపాలి. వీటిని బాగా కలిపి మాడుకు పట్టించాలి. ఈ పూతను గంటపాటు ఆరనిచ్చి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తేనె మాడుకు తేమను అందిస్తుంది. పెరుగు, నిమ్మరసం చుండ్రుతో పోరాడుతాయి. దీంతో చుండ్రు పోతుంది.
ఉసిరికాయ జుట్టుకు పోషణనిచ్చి జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును తేమగా ఉంచుతుంది. ఒక పెద్ద టీస్పూన్ చొప్పున ఉసిరికాయ పొడి, నిమ్మరసాలను ఒక చిన్న గిన్నెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు 5 నిమిషాలు మర్దనా చేయాలి. 10 నిమిషాల తరువాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే చుండ్రు తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.