Green Tea | రోజూ చాలా మంది టీ లేదా కాఫీ సేవిస్తుంటారు. కొందరు ఉదయం నిద్ర లేచిన వెంటనే వీటిని తాగుతారు. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు టీ, కాఫీలను అలా తాగుతూనే ఉంటారు. కానీ టీ లేదా కాఫీలను అంత ఎక్కువగా తాగడం మంచిది కాదు. వీటిల్లో ఉండే కెఫీన్ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీని సేవించవచ్చు. రోజుకు 2 కప్పుల మేర గ్రీన్ టీని సేవిస్తుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్ టీ లో చక్కెర, పాలు కలపకుండా తాగాల్సి ఉంటుంది. అప్పుడే దీంతో లాభాలు కలుగుతాయి. రోజూ గ్రీన్ టీని తాగడం వల్ల అనేక విధాలుగా ఉపయోగాలు కలుగుతాయి. పలు వ్యాధులు నయం అవుతాయి. శరీరానికి పోషణ లభిస్తుంది.
గ్రీన్ టీలో ఈసీజీసీ అనే ఓ రసాయనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణ టీ ఆకుల్లో ఈ రసాయనం ఉండదు. కానీ గ్రీన్ టీ ఆకుల్లో ఉంటుంది. కనుక గ్రీన్ టీని సేవిస్తే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. గ్రీన్ టీని రోజూ సేవించడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. దీంతో క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. ఈ టీని సేవిస్తే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక గ్రీన్ టీని రోజూ సేవించాలి.
గ్రీన్ టీని చైనాలో 4వేల ఏళ్ల కిందటే తాగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దీన్ని అప్పట్లో ఉత్తేజాన్ని కలిగించే పానీయంగా పిలిచేవారట. ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నిజంగానే మనల్ని ఉత్తేజంగా ఉంచుతాయి. గ్రీన్ టీని సేవిస్తే మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం అన్నది ఉండదు. అలాగే ఈ టీని సేవిస్తే కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ టీ ఎంతగానో మేలు చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె పనితీరు మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
గ్రీన్ టీని సేవించడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు గ్రీన్ టీని సేవిస్తుంటే మంచిది. అయితే మోతాదుకు మించి తాగితే బీపీ పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక రోజుకు 2 కప్పులకు మించకుండా గ్రీన్ టీని సేవించాల్సి ఉంటుంది. ఇక ఈ టీని సేవిస్తే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా గ్రీన్ టీని రోజూ సేవించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.