Cumin Water On Empty Stomach | మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. భారతీయ వంటకాల్లో జీలకర్ర ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. దాదాపు మనం చేసే అన్ని వంటకాల్లో జీలకర్రను వాడుతూ ఉంటాం. వంటలకు చక్కటి రుచి తీసుకు రావడంలో జీలకర్ర పాత్ర ఎంతో ఉంది. జీలకర్రలో ఔషధ గుణాలతో పాటు మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, రాగి, మాంగనీస్ వంటి పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి. జీలకర్రను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. జీలకర్రను ఆహారంలో భాగంగా తీసుకోవడమే కాకుండా జీలకర్ర నీటిని తాగడం వల్ల కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు.
జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతోపాటు శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడే వారు జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రక్తహీనతను తగ్గించడంలో కూడా జీలకర్ర నీరు మనకు సహాయపడుతుంది. జీలకర్రలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఐరన్ తక్కువగా ఉన్నవారు, హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు రోజూ జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
జీలకర్ర జీర్ణ ఎంజైమ్ లను ప్రేరేపిస్తుంది. జీలకర్ర నీటిని తాగడంవల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. చక్కటి పొట్ట ఆరోగ్యానికి జీలకర్ర నీరు ఎంతో దోహదపడతాయి. జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి జీలకర్ర నీరు ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటుతో బాధపడే వారికి కూడా జీలకర్ర నీరు మేలు చేస్తాయి. జీలకర్ర నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
జీలకర్ర నీరు డిటాక్స్ డ్రింక్ గా కూడా పనిచేస్తాయి. ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఈ విధంగా జీలకర్ర నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నీటిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ఈ నీటిని మనం రెండు విధాలుగా తయారు చేసి తీసుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వడకట్టి తీసుకోవచ్చు. అలాగే ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించి వడకట్టి తాగవచ్చు.