Cumin And Ginger Water | అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. అందులో భాగంగానే డైట్ పాటించడంతోపాటు వ్యాయామం కూడా చేస్తుంటారు. అయితే శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గాలంటే అందుకు పలు ఆహారాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. వాటిల్లో జీలకర్ర, అల్లం టీ ఒకటని చెప్పవచ్చు. జీలకర్ర, అల్లం వేసి మరిగించిన నీళ్లను రోజూ తాగుతుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ అధిక బరువును తగ్గిస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. జీలకర్ర, అల్లం నీళ్లను రోజూ తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయని ఆయుర్వేదం సైతం చెబుతోంది. ఇది అత్యుత్తమ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ అని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ డ్రింక్ వల్ల ఎన్నో వ్యాధులు సైతం నయం అవుతాయని కూడా అంటున్నారు.
జీలకర్ర, అల్లం నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణాశయ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. అల్లం వల్ల థర్మో జెనెసిస్ అనే ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీంతో శరీరంలో వేడి పుడుతుంది. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. జీలకర్ర, అల్లం రెండూ కూడా జీర్ణ వ్యవస్థ పనితీరుకు ఎంతో సహాయం చేస్తాయి. జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అయ్యేందుకు సహాయం చేస్తాయి. దీంతో జీర్ణాశయంలో ఆమ్లత్వం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
అల్లంలో ఆకలిని నియంత్రించే గుణాలు ఉంటాయి. జీలకర్ర వల్ల కూడా ఆకలికి సంబంధించిన హార్మోన్లు నియంత్రించబడతాయి. అందువల్ల జీలకర్ర, అల్లం నీళ్లను సేవిస్తుంటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. జీలకర్ర, అల్లం నీళ్ల మిశ్రమం సహజసిద్ధమైన డైయురెటిక్‌గా పనిచేస్తుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఉన్న నీరు మూత్రం ద్వారా బయటకు పోతుంది. పాదాల వాపులు తగ్గుతాయి. జీలకర్ర మన శరీరంలో చేరిన వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయం చేస్తుంది. అల్లం వల్ల జీర్ణ వ్యవస్థ క్లీన్ అవుతుంది. దీంతో పొట్ట లైట్‌గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.
జీలకర్ర, అల్లం రెండింటిలోనూ డిటాక్సిఫయింగ్ గుణాలు ఉంటాయి. ఇవి లివర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతాయి. దీంతో లివర్ క్లీన్ అవుతుంది. లివర్‌లో ఉన్న కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గడంలో ఈ మిశ్రమం సహాయం చేస్తుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీలకర్ర వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే కొవ్వులు సులభంగా జీర్ణం అవుతాయి. మనం తిన్న ఆహారంలో ఉండే ఇతర పోషకాలను శరీరం శోషించుకునేందుకు అల్లం సహాయ పడుతుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది. ఇలా జీలకర్ర, అల్లం నీళ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఈ నీళ్లను రోజూ ఒకసారి ఉదయం తాగితే ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు.