ముఖద్వార క్యాన్సర్ నివారణలో‘క్రయో అబ్లేషన్’ థెరపీ
ఒక్కసారి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని నిర్ధారణ అయితే.. ఆ మహిళ అమ్మతనపు కలల్ని చిదిమేసుకోవాల్సిందే! ఓ కమ్మని పిలుపునకు దూరం కావాల్సిందే. కానీ, ‘క్రయో అబ్లేషన్’ థెరపీ ఆ దుష్పరిణామాన్ని దూరంచేస్తుంది. క్యాన్సర్ కోరల నుంచి బయటపడిన తర్వాత కూడా పిల్లల్ని కనేఅవకాశం ఇస్తుంది. కాబట్టే, ఈ వైద్య విధానానికి ఇంత ఆదరణ.
కోతలు, దుష్ప్రభావాలు లేకుండా కేవలం శీతలీకరణ ద్వారానే చేసే చికిత్స ఇది. శీతలీకరణ ఆయుధంగానే క్యాన్సర్ కణాలను మట్టుబెడతారు. అయితే, క్యాన్సర్ కణాలు గర్భాశయ ముఖద్వారంపై 3 మిల్లీమీటర్ల కంటే తక్కువగా వ్యాపిస్తేనే ఈ చికిత్స సాధ్యం అవుతుంది. ఆ పరిధిని దాటితే థెరపీ పనిచేయదు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఛాతీ క్యాన్సర్.. మహిళలను తీవ్రంగా ఇబ్బందిపెట్టే రుగ్మతలు. ప్రారంభ దశలో లక్షణాలు కానీ, సంకేతాలు కానీ కనిపించవు. క్యాన్సర్ తీవ్రత పెరిగేకొద్దీ ఒక్కో లక్షణం బయటపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో కీమో, రేడియేషన్ థెరపీతో పాటు శస్త్ర చికిత్సవైపు మొగ్గు చూపుతారు వైద్యులు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు సంబంధించినంత వరకూ, వ్యాధి తీవ్రతను బట్టి ‘క్రయో అబ్లేషన్’ థెరపీనే సిఫారసు చేస్తారు. దీనికో కారణం ఉంది. మిగతా వైద్య విధానాలలో గర్భసంచిని తొలగించడం లేదా కొంత భాగాన్ని తీసేయడం తప్పనిసరి. ఆ ప్రభావం రోగి సంతాన సామర్థ్యం మీద పడుతుంది. భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశాలు మృగ్యం అవుతాయి. అదే క్రయో అబ్లేషన్ చికిత్సతో అయితే, గర్భసంచికి ఏమాత్రం నష్టం ఉండదు. పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. ఈ విధానంలో 99 శాతం మేర క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు. అందుకే ‘క్రయో అబ్లేషన్’ థెరపీ ఇంత ఆదరణ పొందుతున్నది. గతంలో ఎండోస్కోపీ ప్రొసీజర్‌లో కూడా క్రయో అబ్లేషన్ థెరపీని వాడేవారు. కానీ ఇప్పుడు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ఉపయోగిస్తున్నారు. వైద్య ప్రపంచం కూడా ఫలితాల పట్ల సంతృప్తికరంగానే ఉంది.
క్యాన్సర్‌కు ‘ముఖద్వారం’
గర్భాశయ క్యాన్సర్‌ను వైద్య పరిభాషలో ‘కార్సినోమా ఆఫ్ సర్విక్స్’అంటారు. ప్రధానంగా రుతుస్రావ పరిశుభ్రతను పాటించకపోవడం, జన్యు సంబంధ లోపాలు, విశృంఖలమైన లైంగిక సంబంధాలు, హ్యూమన్ పాపిల్లోమా వైరల్ ఇన్ఫెక్షన్, హెచ్ఐవీ తదితర కారణాల వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకుతుంది. ఈ వ్యాధి నాలుగు దశలలో ఉంటుంది. అయితే, జీరో దశలోనే ‘క్రయో అబ్లేషన్ థెరపీ’ వీలవుతుంది.
జీరో స్టేజి (కార్సినోమా ఇన్ సిటూ): గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ జీరో స్టేజిలోనూ మళ్లీ మూడు దశలు.
ఒకటి.. సీఐఎన్-1
రెండు.. సీఐఎన్-2
మూడు.. సీఐఎన్-3
వ్యాధి సీఐఎన్-1 దశలో ఉన్నప్పుడు ఎలాంటి చికిత్సా చేయరు. అబ్జర్వేషన్లో పెడతారంతే. క్యాన్సర్ రుగ్మత సీఐఎన్-2, 3 దశలలో ఉన్నప్పుడు నిపుణులు క్రయో అబ్లేషన్ థెరపీని ఎంచుకొంటారు. సీఐఎన్-3 స్టేజి దాటిపోతే.. అప్పుడు వ్యాధి స్టేజి-1కు చేరుతుంది. అంటే క్యాన్సర్ కణాలు గర్భాశయంపై 3 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇక, క్రయో అబ్లేషన్ థెరపీ చేయలేరు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇతర వైద్య విధానాలను ఆశ్రయిస్తారు.
క్రయో అబ్లేషన్ విధానం
ఈ పద్ధతిలో, ముందుగా గర్భాశయంపై క్యాన్సర్ కణాలు ఎక్కడున్నాయో గుర్తిస్తారు. తర్వాత, మైనస్ 75 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద లిక్విడ్ నైట్రోజన్‌ను క్యాన్సర్ కారకంపైకి పంపుతారు. ఈ శీతలీకరణలో గర్భాశయ ముఖద్వార పొరలపై ఉన్న క్యాన్సర్ కణాలు దాదాపుగా నశిస్తాయి. క్రయో అబ్లేషన్ థెరపీ వల్ల గర్భాశయానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఈ విధానంలో కోతలు ఉండవు. రసాయనాలు వాడరు. రేడియేషన్ వంటి విధానాలనూ ప్రయోగించరు. ఒకసారి క్రయో అబ్లేషన్ థెరపీ చేస్తే, 99 శాతం మేర గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. ఇంతకుముందే ప్రస్తావించినట్టు, ఈ పద్ధతిని వ్యాధి ప్రారంభ దశలో మాత్రమే, అంటే జీరో స్టేజిలోనే ఉపయోగిస్తారు. క్రయో అబ్లేషన్ తరువాత మళ్లీ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకడం అనేది చాలా అరుదు. తీవ్రస్థాయిలో చెడు అలవాట్లు ఉన్నప్పుడు, వ్యక్తిగత పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసినప్పుడు మాత్రం పునరావృతం కావచ్చు.
అవగాహనతో తగ్గుముఖం
అదృష్టవశాత్తు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గతంలో దేశ వ్యాప్తంగా ఏటా 1.5లక్షల కేసులు ఉండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 90వేలకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో పెరిగిన ఆరోగ్య చైతన్యమే. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రుతు సంబంధ
పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పట్టడం కూడా ఇందుకు ఉపకరించింది.
డాక్టర్ చింతమడక సాయిరామ్
క్ల్లినికల్ అంకాలజిస్టు, ఎంఎన్‌జే
క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్
… మహేశ్వర్‌రావు బండారి