Crying | దుఃఖం.. తీవ్రమైన విషాదంలో ఉన్నా లేదా కష్టాలు, ఆపదల్లో చిక్కుకున్నా.. చాలా మందికి తెరలు తెరలుగా వస్తుంది. ఈ విషయంలో స్త్రీలు ముందుగానే ఎమోషనల్ అయి ఏడ్చేస్తుంటారు. పురుషులకు కూడా మనస్సులో తీవ్రమైన బాధ ఉంటుంది. కానీ వారు దుఃఖించారంటే ఇంట్లో ఉన్న స్త్రీలు ఎక్కడ డీలా పడిపోతారోనని తమ బాధను మనస్సులోనే దాచుకుని పైకి గంభీరంగా ఉంటారు. అయినప్పటికీ ఎవరికైనా సరే విపత్కర పరిస్థితుల్లో తీవ్రమైన దుఃఖం వస్తూనే ఉంటుంది. ఆ పరిస్థితులు వచ్చేందుకు అనేక కారణాలు కూడా ఉంటాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు.. ఇంకా అనేక కారణాల వల్ల చాలా మంది తరచూ దుఃఖిస్తుంటారు. అయితే భావోద్వేగాల పరంగా చూసుకుంటే దుఃఖం అంత మంచిది కాదు. కానీ ఆరోగ్యానికి దుఃఖం అనేది మేలే చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
దుఃఖించడం అంటే మనస్సులో ఉన్న బాధను బయట పెట్టడమే. దీంతో మనస్సు చాలా తేలికగా మారుతుంది. ఒక్కసారిగా బరువు అంతా బయటకు దించేసినట్లు అవుతుంది. అందుకనే మన బామ్మలు, తాతలు.. ఎవరైనా దుఃఖంలో ఉన్నారంటే ఏడవమనే చెబుతారు. దీంతో మనస్సులో ఉన్న బాధను పూర్తిగా కాకపోయినా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఏడవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు సైతం తగ్గుతాయి. ఏడ్చినప్పుడు కన్నీళ్లు వస్తే ఇంకా మంచిదట. దీంతో కార్టిసోల్, అడ్రినో కార్టికో ట్రోపిన్ (ఏసీటీహెచ్) అనే ఒత్తిడి హార్మోన్ల ప్రభావం తగ్గుతుంది. ఫలితంగా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆందోళన, కంగారు తగ్గిపోతాయి. మనస్సులో ఉన్న బాధను బయటకు పంపేందుకు మద్యం తాగాల్సిన పనిలేదు. కాసేపు దుఃఖిస్తే చాలని పరిశోధకులు చెబుతున్నారు.
దుఃఖించడం వల్ల విషాదం, కోపం, విసుగు వంటి భావోద్వేగాలన్నీ తగ్గుతాయి. దుఃఖించడం అనేది ఈ భావోద్వేగాలను తగ్గిస్తుంది. దీంతో శరీరంపై నెగెటివ్ ప్రభావం పడదు. అలాగే దుఃఖించడం వల్ల కొందరు తమను తాము పూర్తిగా ధైర్యంగా మార్చుకునే శక్తి లభిస్తుందట. దీంతో ఏ పనిని పూర్తి చేసేందుకు కావల్సిన శక్తిని అయినా తిరిగి కూడదీసుకుంటారట. అలాగే దుఃఖించడం అనేది శారీరక ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. దుఃఖం వల్ల కళ్లలో సహజంగానే ద్రవాల ఉత్పత్తి పెరుగుతుంది. కన్నీళ్లే అందుకు ఉదాహరణ. కన్నీళ్లు కళ్లలో సహజసిద్ధంగా ఏర్పడే ద్రవం. ఇది కళ్లను తడిగా ఉంచుతుంది. కళ్లు పొడిబారకుండా చూస్తుంది. దీంతో కళ్లలో ఉండే మంట, దురద తగ్గిపోతాయి. కళ్లలో ఉండే దుమ్ము, ధూళి కణాలు, బ్యాక్టీరియా బయటకు పోతాయి. కళ్లు ఇన్ఫెక్షన్కు గురి కాకుండా రక్షిస్తాయి.
పొడిగా కళ్లు ఉంటే దీర్ఘకాలంలో కంటి చూపు సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ దుఃఖించడం వల్ల ఏర్పడే కన్నీళ్లు కళ్లను తేమగా ఉంచుతాయి. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. కానీ ఇది తాత్కాలికమే. అలా అని ఎల్లప్పుడూ దుఃఖిస్తూ ఉండలేరు కదా. కానీ కళ్లను తేమగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే ఎల్లప్పుడూ కంటి చూపు సమస్యలు రావు. దుఃఖించడం వల్ల వచ్చే కన్నీళ్ల ద్వారా కళ్లలో ఉండే టాక్సిన్లు బయటకు పోతాయి. కళ్లు శుభ్రంగా మారుతాయి. కొందరికి తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా తలనొప్పి వస్తుంది. అలాంటప్పుడు బాధ కూడా ఉంటే దుఃఖించాలట. దీంతో తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దుఃఖించడం వల్ల మైండ్ రిలాక్స్ అయి రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. ఇలా దుఃఖం అనేది ఆరోగ్య ప్రయోజనాలనే అందిస్తుంది. కానీ దుఃఖం మంచిదని చెప్పి తరచూ దుఃఖించకూడదు. బాగా ఎమోషనల్ అయినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. తరచూ దుఃఖించడం కూడా మంచిది కాదన్న విషయం గుర్తుంచుకోండి.