కార్టిసాల్.. ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పెరుగుతుంది. ఎందుకంటే, ఈ హార్మోన్ మనిషిలో ‘ఒత్తిడి’ని పెంచుతుంది. అయితే,
నాణేనికి మరోవైపు చూస్తేనే.. అందులోని ఆత్మీయ కోణం కనిపిస్తుంది. నిజానికి ‘కార్టిసాల్’మన శరీరానికి ‘అత్యవసర నిధి’లాంటిది. ఆరోగ్యానికి అద్భుతమైన ‘రక్షణ కవచం’లా పనిచేస్తుంది. శరీర సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు.. కార్టిసాల్ ఒక సంరక్షకుడిగా మారిపోతుంది. పామును చూసినప్పుడో, ఎదురుగా ఏదైనా వాహనం దూసుకొస్తున్నప్పుడో.. మనం తక్షణమే స్పందించేలా చేస్తుంది. గుండె వేగాన్ని, రక్తపోటును పెంచి, కండరాలకు రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది. దీనివల్ల ఆ ప్రమాదం నుంచి వేగంగా బయట పడటానికి కావాల్సిన అసాధారణమైన శారీరక, మానసిక బలం లభిస్తుంది.
శరీరంలో ఎక్కడైనా గాయమైనా, ఇన్ఫెక్షన్ సోకినా వాపు, నొప్పి రావడం సహజం. ఇలాంటి సమయంలో కార్టిసాల్ సహజసిద్ధమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మితిమీరి స్పందించకుండా చూస్తుంది. గాయాల వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, శరీరం త్వరగా కోలుకునేలా చేస్తుంది. వైద్యంలోనూ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి కార్టిసాల్ కృత్రిమ రూపమైన ‘స్టెరాయిడ్స్’ను వాడుతుంటారు.

మనల్ని ఉదయం నిద్రలేపేదే కార్టిసాల్. రాత్రి ముగుస్తున్న కొద్దీ శరీరంలో ఈ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. దాంతో నిద్ర మగత, బద్ధకం వదిలిపోతుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అప్పుడే మనం మంచం మీదినుంచి చురుగ్గా లేవగలుగుతాం. రోజంతా అలసట లేకుండా పనులు చేసుకోవడానికి అవసరమైన ఉత్సాహాన్ని పొందుతాం.
తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కార్టిసాల్ది కీలక పాత్ర. ఇది శరీరంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వుల జీవక్రియలను నియంత్రిస్తుంది. శరీరానికి అత్యవసరంగా శక్తి కావాల్సి వచ్చినప్పుడు.. కాలేయం నుండి గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల అయ్యేలా చేస్తుంది. బ్రెయిన్, కండరాలకు కావాల్సిన ఇంధనాన్ని అందిస్తుంది.

భయం, ఒత్తిడి ఉన్న సమయంలో మనకు ప్రతి చిన్న విషయం కూడా స్పష్టంగా గుర్తుంటుంది. దానికి కారణం కార్టిసాల్. ఇది మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాలను తాత్కాలికంగా ఉత్తేజపరిచి, క్లిష్ట పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకునేలా ఏకాగ్రతను, అప్రమత్తతను పెంచుతుంది.