e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home Top Slides కరోనా.. గందరగోళం

కరోనా.. గందరగోళం

కరోనా.. గందరగోళం
  • వైరస్‌ విషయంలో తొలినుంచీ అయోమయమే
  • మహమ్మారి కట్టడిపై తడబాటు ప్రకటనలు
  • రోగుల చికిత్సలోనూ మార్పులు, చేర్పులు
  • తాజాగా టీకా డోసుల వ్యవధిలో సవరణ

ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి విషయంలో తొలి నుంచి గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. ఒక చికిత్సతో సత్ఫలితాలు వస్తాయని ప్రకటించిన కొన్నిరోజులకే అది పనికిరాదని తేల్చటం, ఫలానా జాగ్రత్తలు మేలని చెప్పిన తర్వాత.. ఆ జాగ్రత్తలతో ఫలితమే లేదని అనటం జరుగుతూ ఉంది. ఇదే ఒరవడిలో.. తాజాగా, కరోనా టీకా కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధి మరోసారి మారింది. ఈ నేపథ్యంలో, కరోనా కల్లోలం ఇప్పటివరకూ సృష్టించిన గందరగోళం, మార్పులు, సవరణలను చూద్దాం.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌: మలేరియా చికిత్సకు వాడే ఈ ఔషధం కరోనాను ఎదుర్కోవటంలోనూ మెరుగ్గా పనిచేస్తుందని పలు ఔషధ సంస్థలు పేర్కొన్నాయి. కొవిడ్‌-19 రోగుల చికిత్సకు దీన్ని వాడొచ్చని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ గతేడాది అనుమతులను కూడా ఇచ్చింది. అమెరికాకు పెద్దఎత్తున ఈ ఔషధాన్ని భారత్‌ ఎగుమతి చేసింది. అయితే, కరోనా తీవ్రతను తగ్గించడంలో ఈ ఔషధం అంతగా పనిచేయట్లేదని తర్వాత పరిశోధనల్లో వెల్లడైంది

గందరగోళం ఎందుకంటే?
కరోనాకు సంబంధించిన ప్రకటనల్లో తరచూ మార్పులు చోటుచేసుకోవటం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మహమ్మారి విజృంభించిన తర్వాత వైరస్‌ పలు రకాలుగా రూపాంతరం చెందుతున్నదని.. దీంతో పరిశోధనలను బట్టి కట్టడి చర్యల్లో కూడా దశలవారీగా సవరణలు చేయాల్సి వస్తున్నదని చెప్పారు. వ్యాక్సిన్‌ డోసుల మధ్య వ్యవధిని పెంచడానికి కూడా ఇదే కారణమని తెలిపారు. వైరస్‌ ఉనికిలోకి వచ్చిన తొలిదశలో దానిగురించి అప్పటివరకూ ఏమీ తెలియకపోవటం వల్లే చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, ఆవిరి పట్టడం, ప్లాస్మా చికిత్స వంటి ప్రత్యామ్నాయాలను సూచించినట్టు వైద్యులు అభిప్రాయపడ్డారు.

వైరస్‌ వ్యాప్తి: తుమ్మ డం, దగ్గడం వల్ల 6 అడుగుల దూరం వరకు కరోనా ప్రయాణించగలదని, గాలి ద్వారా వైరస్‌ ప్రయాణిస్తుందనడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గతంలో ప్రకటించింది. అయితే అమెరికా, బ్రిటన్‌, కెనడా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో గాలి ద్వారా కూడా కరోనా ప్రయాణిస్తుందని, తలుపులు, కిటికీలు మూసి ఉంచిన గదిలో 12 అడుగుల దూరం వరకు వైరస్‌ ప్రయాణించగలదని తేలింది.

ఐవర్‌మెక్టిన్‌: యాంటీ పారసైటిక్‌ ఔషధం ‘ఐవర్‌మెక్టిన్‌’ను క్రమం తప్పకుండా వాడటం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చని అమెరికాకు చెందిన ఫ్రంట్‌లైన్‌ కొవిడ్‌-19 క్రిటికల్‌ కేర్‌ అలయన్స్‌ పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఈ వాదనను డబ్ల్యూహెచ్‌వో తోసిపుచ్చింది. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం మినహా ఈ ఔషధాన్ని వాడొద్దని సూచించింది. కొవిడ్‌-19 చికిత్సకు ఐవర్‌మెక్టిన్‌ సమర్థమంతంగా పనిచేస్తున్నట్టు శాస్త్రీయ ఆధారం లభించలేదన్నది.

ప్లాస్మా చికిత్స: కరోనా రోగుల చికిత్సకు కాన్వలసెంట్‌ ప్లాస్మా థెరపీ సాయపడుతుందని తొలుత కేంద్రం ప్రకటించింది. దీంతో ప్లాస్మా దాతల కోసం రోగుల కుటుంబసభ్యులు అప్పట్లో జల్లెడ పట్టి వెదికేవారు. అనంతరం వ్యాధి లక్షణాలు ఒక మోస్తరుగా ఉన్నప్పుడు, వైరస్‌ సోకిన ఏడు రోజులలోపే రోగులకు ప్లాస్మాను ఇవ్వాలని కేంద్రం సవరణలు చేసింది. అయితే, ప్లాస్మా థెరపీతో ఉపయోగం లేదని వైద్యులు చెబుతున్నారు.

ఆవిరి పట్టడం: కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో.. ఆవిరి పట్టడం (స్టీమ్‌ ఇన్‌హలేషన్‌) వల్ల శరీరంలో ఉన్న వైరస్‌ నశిస్తుందని ప్రచారం జరిగింది. కొంతమంది వైద్యులు కూడా దీన్ని సమర్థించారు. అనంతరం ఇది అవాస్తవమని తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే ‘ఆవిరి పట్టడం’ మేలు చేస్తుందని, అయితే ఇది చికిత్సకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం మాత్రం కాదని ప్రభుత్వం తెలిపింది.

టీకాల వ్యవధి: కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య కనీసం 28 రోజుల వ్యవధి ఉండాలని కేంద్రం తొలుత సూచించింది. అనంతరం ఈ వ్యవధిని 6-8 వారాలకు పెంచింది. తాజాగా దీన్ని రెట్టింపు చేస్తూ 12-16 వారాలకు పొడిగించింది. కొవాగ్జిన్‌ టీకా విషయంలో రెండు డోసుల మధ్య వ్యవధి గతంలో కనీసం 28 రోజులుగా ఉండేది. ప్రస్తుతం ఇది 6-8 వారాలుగా ఉన్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా.. గందరగోళం

ట్రెండింగ్‌

Advertisement