Coriander Leaves Water | మనం కొత్తిమీరను రోజూ అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. కొత్తిమీర ఆకులను అనేక కూరల్లో వేస్తుంటారు. కానీ కూరల్లో వేసే కొత్తిమీర ఆకులను తినేందుకు చాలా మంది అంత ఆసక్తిని చూపించరు. అయితే కొత్తిమీర ఆకులను తినకపోతే అనేక లాభాలను కోల్పోయినట్లే అవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర ఆకుల్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల అనేక విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ఇవి మనల్ని అనేక రోగాల నుంచి సురక్షితంగా ఉంచుతాయి. అయితే కొత్తిమీర ఆకులను తినలేని వారు వీటితో నీళ్లను తయారు చేసి రోజూ ఉదయం పరగడుపున తాగవచ్చు. కొత్తిమీర ఆకులను నీటిలో వేసి మరిగించాలి. అనంతరం గోరు వెచ్చగా ఉండగానే ఒక గ్లాస్ మోతాదులో తాగేయాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
కొత్తిమీర ఆకుల్లో విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫైబర్, ఐరన్, మాంగనీస్, క్యాల్షియం, విటమిన్ కె, ఫాస్ఫరస్ కూడా ఈ ఆకుల్లో అధికంగానే ఉంటాయి. కొత్తిమీర ఆకుల్లో 11 రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. శాచురేటెడ్ కొవ్వు చాలా స్వల్ప మోతాదులో ఉంటుంది. లినోలిక్ యాసిడ్ కూడా అధిక మొత్తంలోనే లభిస్తుంది. నిపుణులు చెబుతున్న ప్రకారం 100 గ్రాముల కొత్తిమీర ఆకులను తినడం వల్ల సుమారుగా 31 క్యాలరీలు లభిస్తాయి. 2 గ్రాముల పిండి పదార్థాలు, 4 గ్రాముల ప్రోటీన్లు, 0.7 గ్రాముల కొవ్వు, 146 మిల్లీగ్రాముల క్యాల్షియం, 5.3 మిల్లీగ్రాముల ఐరన్, 4.7 గ్రాముల ఫైబర్, 24 మిల్లీగ్రాముల విటమిన్ సి, 635 మిల్లీగ్రాముల విటమిన్ ఎ లభిస్తాయి.
కొత్తిమీర ఆకుల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లలోని రెటీనాను సంరక్షిస్తుంది. దీంతో కళ్లలో తేమ ఉంటుంది. కళ్లు పొడిబారకుండా, దురద పెట్టకుండా ఉంటాయి. కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొత్తిమీర ఆకులను తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొత్తిమీర ఆకుల్లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గిస్తాయి. హెచ్డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కొత్తిమీర ఆకుల నీళ్లను తాగితే క్యాల్షియం, మాంగనీస్, మెగ్నిషియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీర ఆకులు మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్కు వ్యతిరేకంగా పోరాడుతాయి. కణాలను రక్షిస్తాయి. దీంతో చర్మం సురక్షితంగా ఉంటుంది. కొత్తిమీర ఆకులను తినడం వల్ల లేదా నీళ్లను తాగడం వల్ల గుండె సైతం ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. అయితే ఉదయం పరగడుపున ఈ నీళ్లను తాగలేకపోతే భోజనానికి 45 నిమిషాల ముందు లేదా భోజనం చేశాక 45 నిమిషాల తరువాత అయినా తాగవచ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.