Health Tips | పురుషులతో పోలిస్తే.. మహిళల్లో నొప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వెన్నునొప్పి, కీళ్లనొప్పులు, మైగ్రేన్, నెలసరి సమయంలో వచ్చే నొప్పులు వారిని విపరీతంగా వేధిస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. ప్రతి వందమందిలో దాదాపు 45 మంది మహిళలు ఏదో ఒక దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతుంటారట. అయితే, కొన్ని ఇంటి చిట్కాలు, స్వీయ సంరక్షణ చర్యల ద్వారా ఆయా నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కీళ్ల నొప్పులు
జన్యుపరమైన సమస్యలు, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, మానసిక ఒత్తిడి.. మహిళలను కీళ్లనొప్పుల బారిన పడేస్తాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైనా, క్యాల్షియం, విటమిన్ డి తగ్గినా.. ఈ సమస్య తీవ్రం అవుతుంది. యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. కీళ్లనొప్పులతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే ‘కర్కుమిన్’ కూడా సహజసిద్ధమైన నొప్పి నివారిణి. గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా పసుపు కలిపి తాగితే.. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
మైగ్రేన్
పురుషుల కన్నా.. మహిళలు తరచుగా తలనొప్పికి గురయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ. రుతుస్రావం, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, జీవనశైలి, ఒత్తిడి ఇందుకు కారణం. 93% మంది ప్రజల్లో తలనొప్పికి కారణం.. ఒత్తిడేనని తేలింది. డ్రైఫ్రూట్స్ పెయిన్ కిల్లర్స్‌లా పనిచేస్తాయి. జీడిపప్పు, బాదం, పిస్తా లాంటివి తీసుకోవడం ద్వారా తల నొప్పిని తగ్గించుకోవచ్చు. మైగ్రేన్‌తో ఎక్కువగా ఇబ్బంది పడేవారు.. క్రమం తప్పకుండా పుదీనా తీసుకోవడం మంచిది. అల్లంలోనూ తలనొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. డీహైడ్రేషన్ కూడా తీవ్రమైన తలనొప్పిని కలిగిస్తుంది. కాబట్టి, కీరదోస వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
నెలసరి నొప్పులు
పీరియడ్ హెల్త్ స్టడీ ప్రకారం.. దేశంలోని 83% మంది మహిళలు నెలసరి నొప్పితో బాధపడుతున్నారట. వీరిలో 10శాతం మందిలో నొప్పి తీవ్రంగా ఉంటూ.. రోజువారీ పనులు కూడా చేసుకోలేక పోతున్నారట. ఇలాంటివారు నెలసరి సమయంలో దుంపకూరలతోపాటు అల్లం ఎక్కువగా తీసుకోవాలి. అల్లంలో ఉండే వైద్య గుణాలు, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. కడుపులో కలిగే ఇబ్బందిని కంట్రోల్ చేస్తాయి. పెరుగు, ఎండుద్రాక్షలను కలిపి తీసుకోవడం ద్వారా నెలసరి నొప్పుల నుంచి బయటపడొచ్చు. సోంపు గింజల్ని నమిలినా, వాటిని నీటిలో మరిగించి తాగినా నెలసరి నొప్పులు తగ్గుతాయి.