మలంలో రక్తం పడుతుంటే చాలామంది మొలల వ్యాధి (హీమరాయిడ్స్) అనుకుంటారు. కానీ అది పేగు (కొలెరెక్టల్) క్యాన్సర్కు సూచిక కూడా కావచ్చు. అయితే కొన్ని దశాబ్దాలుగా పేగు క్యాన్సర్ తగ్గుతూ వస్తున్నది. కానీ, యువతరంలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నది. మలంలో రక్తం పడటం, మలం ఆకారంలో, పరిమాణంలో మార్పులు, విసర్జనకు వెళ్లడంలో ఎక్కువ తక్కువలు లాంటివి పేగుల్లో సమస్యలకు సంకేతాలు.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుణ్ని సంప్రదించడం ఉత్తమం. ఇక యువకులలో ఈ సమస్య ఎందుకు కనిపిస్తున్నదనే దాని గురించి పరిశోధకులు కూడా సరిగ్గా తెలుసుకోలేక పోయారు. అది ఊబకాయంతో ముడిపడి ఉన్నది కావచ్చు, ధూమపానం, ప్రాసెస్డ్ మాంసంలాంటి అధిక కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలు తినడం, సోమరితనంతో కూడిన జీవనశైలితో సంబంధం ఉండటం వల్ల కూడా అయ్యుండవచ్చు.
లేదంటే పేగుల్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అసమతుల్యత కూడా దీనికి కారణం కావచ్చంటున్నారు పరిశోధకులు. అయితే 2030 నాటికి పేగు క్యాన్సర్ 20- 34 ఏండ్ల వయసు వారికి 90 % వరకు ముప్పు పొంచి ఉంటే, 35- 49 వయసు వారికి 28 % ముప్పు కారకంగా నిలవనుంది. అందుకే ఇటీవలి కాలంలో ముప్పు ఎక్కువగా ఉన్నవారికి, కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉన్నవారికి పేగు క్యాన్సర్ నిర్ధారణకు కనీస వయసును 45గా నిర్ణయించారు.
ఎవరిని సంప్రదించాలి? గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు
పరీక్షలు: కొలనోస్కోపి ద్వారా గాయాలను గుర్తిస్తారు. తద్వారా అవి క్యాన్సర్లుగా మారకముందే తీసివేస్తారు. ఇంకా పేగుల్లో, మలద్వారంలో అభివృద్ధి చెందుతున్న వ్రణాలు, ఇతర కణుతులను కూడా తొలగిస్తారు.