Coconut Milk | పాలు.. దీని పేరు చెప్పగానే అందరూ సహజంగానే గేదె లేదా ఆవు పాలు అని అనుకుంటారు. కానీ జంతు సంబంధ పాలు మాత్రమే కాదు, మనకు పలు రకాల వృక్ష సంబంధమైన పాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొబ్బరిపాలు కూడా ఒకటి. కొబ్బరిని మిక్సీలో వేసి బాగా పిండి దాన్నుంచి కొబ్బరి పాలను తయారు చేస్తారు. పచ్చి కొబ్బరితో ఇలా పాలను తయారు చేయవచ్చు. ఇలా తయారు చేసిన కొబ్బరిపాలను వంటల్లో ఉపయోగిస్తారు. ఆసియాలోని అనేక ప్రాంతాలకు చెందిన వారు కొబ్బరిపాలను తరచూ వంటల్లో వాడుతారు. అయితే కొబ్బరిపాలతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిపాలలో అనేక పోషకాలు ఉంటాయి. కొబ్బరిపాలను తరచూ తాగడం వల్ల పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని అంటున్నారు.
కొబ్బరిపాలను ఒక కప్పు మోతాదులో తీసుకుంటే సుమారుగా 400 క్యాలరీల మేర శక్తి లభిస్తుంది. కొవ్వు 40 గ్రాములు, పిండి పదార్థాలు 13 గ్రాములు, ప్రోటీన్లు 5 గ్రాములు, ఫైబర్ 5 గ్రాములు, స్వల్ప మొత్తాల్లో విటమిన్ సి, ఫోలేట్, విటమిన్లు డి, ఎ, బి12 ఉంటాయి. అలాగే మాంగనీస్, కాపర్, మెగ్నిషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం వంటి మినరల్స్ కూడా కొబ్బరిపాలలో సమృద్ధిగా లభిస్తాయి. కొబ్బరిపాలను తాగడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అందువల్ల వ్యాయామం చేసిన వారు లేదా శారీరక శ్రమ చేసిన వారు బాగా అలసటగా, నీరసంగా ఉంటే కొబ్బరి పాలను తాగాలి. దీంతో శక్తి లభించి మళ్లీ ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. కొబ్బరిపాలలో ఉండే మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్స్ మన శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కొబ్బరిపాలలో ఉండే మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్స్ ఆకలిని నియంత్రిస్తాయి. కొవ్వు కరగడాన్ని ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వు కరిగేలా చేస్తాయి. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరిపాలను తాగడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. శరీరం ఇన్ఫెక్షన్లను, రోగాను తగిస్తుంది. ఈ పాలలో ఉండే లారిక్ యాసిడ్ యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక కొబ్బరిపాలను సేవిస్తుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. కొబ్బరిపాలలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. అనేక ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఈ పాలలో ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. కనుక ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరిపాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిలో విటమిన్లు ఎ, డి, ఇ, కె కరుగుతాయి. దీని వల్ల శరీరానికి ఆయా పోషకాలు లభిస్తాయి. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. జీర్ణక్రియకు కావల్సిన ఎంజైమ్ ల ఉత్పత్తి సరిగ్గా ఉంటుంది. శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. కొబ్బరిపాలలో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఇలా కొబ్బరిపాలను సేవించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే కొబ్బరిపాలు కొందరికి పడవు. అలర్జీలను కలిగించే చాన్స్ ఉంది. కనుక ఫుడ్ అలర్జీలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఈ పాలను తాగాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.