వ్యాధులేవీ అకస్మాత్తుగా రావు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు పక్కనపెడితే.. రోగనిరోధక శక్తి తగ్గుముఖం పట్టినప్పుడు దీర్ఘకాలిక రుగ్మతలు ఒంట్లోకి చొరబడతాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు లభించనప్పుడు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఇదే అదనుగా రకరకాల వ్యాధులు దాడి చేస్తాయి. విటమిన్లు లోపించాయనే విషయాన్ని మన శరీరం వివిధ రూపాల్లో ముందస్తుగానే హెచ్చరిస్తుంది. వాటిని గమనంలో ఉంచుకొని జాగ్రత్తపడితే సమస్యను మొగ్గదశలోనే తుంచేయొచ్చు.
ఆహారంలో మెగ్నీషియం, ఐరన్ లోపం వల్ల శరీరం అలసటగా, కండ్లు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. పైగా శరీరానికి తగినంత ఐరన్ అందకపోతే రక్తహీనత (ఎనీమియా) వస్తుంది. ఇది మన శక్తి, భావోద్వేగాల మీద ప్రభావం చూపుతుంది.
శరీరం పోషకాలను ఎలా శోషణం చెందించుకుంటుందనే దానికి మలంలో వచ్చే మార్పులే స్పష్టమైన సంకేతాలు. శరీరం పోషకాలను సరిగ్గా విలీనం చేసుకోలేదు అనేదానికి అతిసారం సూచన. కాబట్టి, మలంలో ఏ మార్పులు కనిపించినా వెంటనే డాక్టర్ను కలవడం మంచిది.
శరీరానికి తగినన్ని పోషకాలు లభించకపోతే వాపులు, ఉబ్బులు సంభవిస్తాయి. ఒకవేళ కాళ్లల్లో వాపు కనిపించిందంటే… అది ప్రొటీన్లు దండిగా లేని ఆహారం వల్లే. ఛాతీలో ఇబ్బందిగా, ఆటంకంగా అనిపిస్తే అది కూడా పోషక సంబంధమైన సమస్యే.
కొన్ని రకాలైన ఆహారాలను మేళవించి తింటే శరీరం పోషకాలను విలీనం చేసుకునే సామర్థ్యం ఇనుమడిస్తుంది. ఉదాహరణకు, కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను విటమిన్ డి ఉన్న పదార్థాలతో కలిపి తింటే మంచిది. దీంతో విటమిన్ డి సాయంతో ఎముకలు కాల్షియంను బాగా శోషింపజేసుకుంటాయి. అందువల్ల, పోషకాలను తగినంతగా సమకూర్చుకోవాలంటే శరీరం తగిన మోతాదులో మిశ్రమ ఆహారం తీసుకోవాల్సిందే.
నెలసరి సక్రమంగా కావడం లేదంటే శరీరానికి క్యాలరీల రూపంలో తగినన్ని పోషకాలు అందడం లేదన్నమాట. ముతక ధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు లాంటివి ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యను పరిష్కరించవచ్చు.