గుండె నొప్పి ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రమే వస్తుందని అనుకునేవాళ్లం. కానీ నేడు వయసుతో సంబంధం లేకుండానే చాలామంది గుండె పోటుకు గురవుతున్నారు. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ గుండె గదులను నిర్బంధించి రక్త ప్రసారాన్ని నిలిపేయడం వల్ల అది గుండెపోటుకు దారితీస్తున్నది. భారతీయుల్లో ఒక ప్రత్యేకమైన కొలెస్ట్రాల్ కలయిక కనిపిస్తుంది. అదే ‘అథెరోజెనిక్ డైస్లిపిడెమియా’. చాలామందిలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండి మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) ఎక్కువగా ఉంటుంది. దీంతో ధమనులకు ప్రమాదం పొంచి ఉంటుంది. గుండె ఎంత సురక్షితం అని తెలుసుకోవడానికి కేవలం ఎల్డీఎల్ స్థాయిని మాత్రమే కాకుండా మొత్తం లిపిడ్ ప్రొఫైల్‌ను పరిగణించాలని వైద్యులు సూచిస్తున్నారు.
అందులో భాగంగానే గుండె రక్షణ కోసం పలు సూచనలు చేస్తున్నారు. ‘గుండె రక్షణకోసం కొలెస్ట్రాల్ నియంత్రణ తప్పనిసరి. అందులో భాగంగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్ ఎక్కవ తీసుకోవాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం వల్ల గుండె సమస్యలు తగ్గి, కొవ్వులు మెరుగుపడతాయి. బరువు నియంత్రణ కూడా పాటించాలి. 5 నుంచి 10 శాతం వరకు బరువు తగ్గడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామాన్ని ఔషధంగా భావించి ప్రతిరోజూ శారీరక శ్రమకు కొంత సమయాన్ని కేటాయించాలి. కేవలం ఆహారం, వ్యాయామాలతో మాత్రమే సరిపెట్టుకోకుండా రెగ్యులర్ చెకప్‌లు సైతం చేయించుకోవాలి’ అని వైద్యులు చెబుతున్నారు.