Cell Therapy- Diabetes | జీవన విధానం, శ్రమ తగ్గడం, పని వేళల్లో మార్పులతో డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్న డయాబెటిస్తో పలువురు మానసికంగా, శారీరకంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ ముదిరితే గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు వస్తాయి. ఈ నేపథ్యంలో దీనికి పూర్తిస్థాయి చికిత్స లేకపోవడంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డయాబెటిస్‌ను అదుపు చేయడానికి పలు రకాల మందులు వాడుతుంటారు.
తాజాగా చైనా శాస్త్రవేత్తలు కొత్త చికిత్స విధానాన్ని కనుక్కుకున్నారు. సెల్ థెరపీ ద్వారా డయాబెటిస్ వ్యాధిని నయం చేసినట్లు చైనా వైద్యులు చెప్పారు. ఈ థెరపీ వల్ల టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునే బాధ తప్పుతుందని భావిస్తున్నారు. కేవలం మూడు నెలల్లోనే డయాబెటిస్ వ్యాధి అదుపులోకి వస్తుందన్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ఉందని చైనా వైద్యులు చెప్పారు.
సెల్ థెరపీ ద్వారా డయాబెటిస్ రోగులకు పెరిపెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ కణాలను సీడ్ కణాలుగా మారుస్తారు. ప్యాంక్రియాట్ ఐలెట్ కణాలనూ పునరుత్పత్తి చేసి డయాబెటిస్ వ్యాధిని అదుపులోకి తెచ్చారు వైద్యులు. దీనివల్ల చెడు ప్రభావాలు ఉండవని, తొలిదశ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. 59 ఏండ్ల డయాబెటిస్ రోగికి ప్రయోగాత్మకంగా అందించిన చికిత్స ద్వారా ఆయన కోలుకున్నాడు. 25 ఏండ్లుగా సెల్ థెరపీపై చైనా వైద్యులు పరిశోధనలు జరుపుతున్నారు. అంతా సవ్యంగా సాగితే డయాబెటిస్ వ్యాధిని నియంత్రించడానికి సెల్ థెరపీ చికిత్స త్వరలో అందుబాటులోకి వస్తుందని చైనా వైద్యులు అంటున్నారు.