మా పాప వయసు 9 నెలలు. వారం కిందట కొన్ని రోజులు బిడ్డ సరిగా పాలు తాగలేదు. జ్వరం కూడా వచ్చింది. పిల్లల డాక్టర్‌కు చూపించాం. సిరప్ ఇచ్చారు. అది వాడితే జ్వరం కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ తీవ్ర జ్వరం వచ్చింది. టెంపరేచర్ 102, 103 ఫారన్‌హీట్‌గా నమోదైంది. పాప కుడికాలు సరిగ్గా కదలించలేకపోతున్నట్టు అనిపించింది. కాలు ముట్టుకుంటే భరించలేనంతగా నొప్పిపెట్టి.. తీవ్రంగా ఏడ్చింది. మళ్లీ వైద్యుణ్ని సంప్రదించాం. బ్లడ్ టెస్ట్, స్కాన్ చేశారు. పరీక్షల ఫలితాలు గమనించి ఇన్ఫెక్షన్ ఉందని వైద్యుడు చెప్పారు. తుంటి ఎముక జాయింట్లో ఇన్ఫెక్షన్ ఉందన్నారు. శస్త్రచికిత్స చేసి చీము తీసేశారు. ఆరువారాలు యాంటీబయాటిక్స్ ఇవ్వమన్నారు. నెలల చిన్నారికి ఇన్ని వారాలు యాంటీబయాటిక్స్ వాడొచ్చా? ఈ జాయింట్ ఇన్ఫెక్షన్ భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందా? ఆందోళనగా ఉంది, సలహా ఇవ్వగలరు?
మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ బిడ్డకు సెప్టిక్ ఆర్థరైటిస్ సమస్య ఉంది. అంటే తుంటి ఎముకలో ఉన్న కీలులో చీము చేరుతుంది. ఇది పూర్తిగా నయం చేయదగిన జబ్బే! సమయానికి గుర్తించడం చాలా అవసరం. మీ విషయంలో సత్వరం స్పందించడం చాలా మంచి విషయంగా చెప్పవచ్చు. పాప తుంటి ఎముక కీలులో చేరిన చీమును తొలగించడం జరిగింది. దీంతోపాటు సరైన యాంటీబయాటిక్స్ ఇచ్చారు.
భవిష్యత్తులో ఏ సమస్యా రాకుండా ఉండటానికే.. జాయింట్లో చీము తొలగించడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం చేస్తారు. వీటిని ఆరు వారాలు కొనసాగించాల్సిందే! మీ పీడియాట్రీషియన్, ఆర్థోపెడిక్ వైద్యులు సూచించినట్టు చికిత్స కొనసాగించండి. క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయండి. సరైన సమయంలో చికిత్స అందటం వల్ల కంగారుపడాల్సిందేం లేదు. పాపకు జబ్బు పూర్తిస్థాయిలో నయం అవుతుంది.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్